వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!

Be Careful With Daily Use Items - Sakshi

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు.

వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్‌ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం.
చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?

మంచినీటి సీసా
ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్‌ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో 
వాడడం హానికరం.  


 

పొపుల పెట్టె
వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది.  

ఇంట్లో పెంచుకునే మొక్కలు
ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ    లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది.  

సాక్స్‌లు, దువ్వెన
కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు.   

టూత్‌బ్రష్‌
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్‌ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్‌ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. 

తలదిండులు
చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. 

లోదుస్తులు
మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top