రవాణా మరింత సులభతరం.. మరిన్ని గ్రామీణ రోడ్లకు మహర్దశ

Modernization of another 916 km of roads in rural areas - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో మరో 916 కిలోమీటర్ల రోడ్ల ఆధునీకరణ

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా మరింత సులభతరం అవనుంది. పాడుబడిపోయిన పాత రోడ్లను పునర్నిర్మించి, ఆధునికంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంజీఎస్‌వై కింద 2,684 కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో 916.22 కిలోమీటర్ల పొడవున రహదారులను పునర్నిర్మించనుంది. పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో రూ. 1066.10 కోట్లతో 115 పాడుబడిన పాత తారు రోడ్లను పునర్నిర్మించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది.

ఆ రోడ్లలో 74 పెద్ద పెద్ద బ్రిడ్జిలను కూడా నిర్మిస్తారు. వీటి మొత్తం నిడివి 6918.97 మీటర్లు (అంటే దాదాపు ఏడు కిలో మీటర్లు) ఉంటుంది. వీటిలో 22 బ్రిడ్జిలు ఒక్కొక్కటి 150 మీటర్ల పొడవుకన్నా ఎక్కువ నిడివి ఉంటాయని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల ఎంపవర్డ్‌ కమిటీ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1,069 కిలోమీటర్ల పొడవున 131 తారు రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 115 రోడ్ల పునర్నిర్మాణానికి ఎంపవర్డ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

వీటిలో 153.01 కిలోమీటర్ల మేర రోడ్లను 5.5 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్‌కు రూ.85.20 లక్షల ఖర్చుతో పునర్నిర్మిస్తారు. మిగి­లిన రోడ్లను 3.75 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్‌కు 58.41 లక్షలతో పునర్నిర్మిస్తారు. పీఎంజీఎస్‌వై కింద ఈ రోడ్ల ఆధునీకరణకు అయ్యే ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రోడ్లకు అంచనాలు ఇప్పటికే పూర్తయినందున, కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు రాష్ట్ర పంచా­య­తీ­రాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు వెల్లడించారు.

పీఎంజీఎస్‌వై పథకంలోనే 2684 కి. మీటర్ల కొత్త రోడ్లు.. 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1.25 లక్షల కిలోమీటర్ల మేర పాత రోడ్ల పునర్నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ 2019లో పీఎంజీఎస్‌వై –3ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవున రోడ్ల ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లలో అందులో 2,314 కిలోమీటర్ల రోడ్లకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటిలో 1804 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది.

దీనికి తోడు పీఎంజీఎస్‌వై, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ (నక్సల్స్, తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం) కింద గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి పలు రోడ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటికి నిధులు కూడా విడుదల చేసింది. అయినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదు.

ఇలా పెండింగ్‌లో ఉన్న 880 కిలోమీటర్ల రహదారులను కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పూర్తి చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొత్తం 2,684 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తయిన పనులకు బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top