దివ్యాంగురాలు కొర్ల రాము
అంధురాలైన నా భార్య పింఛన్ నిలిపివేశారు: జనసేన నేత వీరబాబు
రాజమహేంద్రవరం రూరల్: అంధురాలైన తన భార్య పింఛన్ నిలిపివేశారని జనసేన పార్టీ నేత వీరబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు తన భార్యకు పింఛన్ ఇవ్వడం లేదని బిక్కవోలు మండలం ఆరికిరేవుల గ్రామ పంచాయతీకి చెందిన జనసేన వార్డు మెంబర్ వీరబాబు తెలిపాడు. శనివారం ఆయన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల సెల్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవల్లి భరత్ కుమార్ తదితరులతో కలిసి డీఆర్‌డీఏ పీడీ ఎంవీఎస్‌ఎన్ మూర్తికి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కక్ష పెంచుకున్నారని తెలిపాడు. తన భార్య కొర్ల రాముకు వస్తున్న దివ్యాంగ పింఛన్‌ను గత నెలలో నిలిపివేశారని ఆరోపించారు. సదరం వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు మెమో ఇస్తే.. ఆ మేరకు ఆన్‌లైన్‌లో వైద్యులు పరీక్షించి, 40 శాతం వైకల్యం ఉన్నట్లు నివేదిక ఇచ్చారన్నారు. అయితే గత నెల 31న పింఛను వచ్చినట్లు తన భార్య సెల్‌కు మెసేజ్ వచ్చిందన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగి నగదు ఇవ్వకుండా ఎంపీడీఓ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఆఫ్‌లైన్‌లో మరోసారి రీవెరిఫికేషన్ చేయించాలని, అప్పుడు కూడా 40 శాతం వస్తే పింఛను ఇస్తామని పీడీ చెప్పారని వీరబాబు తెలిపారు.


