
ఏలూరు,సాక్షి: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించాడు. మంగళవారం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేశాడు.
సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తాళలేక బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు.
సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో తిరగనివ్వను. సాక్షి పత్రిక ప్రతులను తాడేపల్లి గూడెం దాటనివ్వను.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడు బాబురావును అసలు చూడలేదని దబాయిస్తూనే బాబూరావు వివాదం వివరాలన్నీ చింతమనేని ప్రభాకర్ బయటపెట్టడం గమనార్హం.
👉గమనిక: చింతమనేని ఆగడాలపై ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం’ అంటూ రాసిన సాక్షి కథనాన్ని యథాతధంగా ప్రచురిస్తున్నాం
ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం
కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూరావు తెలిపారు.
అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్‌ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తాహసీల్దార్, మైనింగ్ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రితమే బాబూరావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పార్టీ కార్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.

మరోవైపు తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తానని చింతమనేని ప్రభాకర్ నుంచి బాబూరావుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగడంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్యే శరణ్యం
‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య