చంద్రబాబు రూ.80 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

Minister taneti Vanitha Comments in Rajahmundry City YSRCP Plenary - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతుంది అంటే అందులో కార్యకర్తల కష్టం ఎంతో ఉందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పాటుపడుతుంది ఆర్మీ అయితే వైఎస్సార్‌సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే. కార్యకర్తలు ఉన్నారనే మనోధైర్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నాం. అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సైతం ప్రతిపక్షాలు బురద చల్లడం దారుణం. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి కూర్చోబెట్టేందుకు కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. 

ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు
వైఎస్సార్‌సీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్ ప్రజల ఆమోదంతోనే 2019లో 151 స్థానాలు గెలవగలిగారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు ఈర్ష్యతో మాట్లాడటం సరికాదు. సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 210 హామీలు ఇచ్చారు.. పదో, పదిహేనో నెరవేర్చి మిగిలినవన్నీ గాలికొదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు రూ.80 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు. కోవిడ్‌లో సైతం ప్రజలకు అన్ని రంగాల్లో సహకారం అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్‌లో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అనడంలో సందేహం లేదు అని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు.

చదవండి: (సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ కులాలకు శ్రీరామరక్ష: ఆర్‌ కృష్ణయ్య)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top