
తాడిపత్రి సీఐపై మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్య
తాడిపత్రి టౌన్: విలేజ్ క్లినిక్‌లలోని డాక్టర్లపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నోరుపారేసుకున్న ఘటన మరిచిపోకముందే తాజాగా ఓ సీఐపైనా ఆయన తన నోటికి పనిచెప్పారు. ‘రోజూ చిల్లర తీసుకునే చిల్లర గాడివి’ అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ సాయిప్రసాద్‌పట్ల ఫోన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సీఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం ఏమిటంటే.. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో తాడిపత్రి పట్టణంలో వీహెచ్‌పీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్ సర్కిల్‌లో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
అదే సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఏఎస్పీ రోహిత్‌కుమార్ ఇది గమనించి బాణాసంచా కారణంగా వాహనదారులకు, పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వారిని స్టేషన్‌కు తీసుకురావాలని సీఐ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. సీఐ అక్కడికి వెళ్లి సంబరాలు చేసుకోవడానికి అనుమతిలేదని, స్టేషన్‌కు రావాలన్నారు. ఈ క్రమంలో.. వీహెచ్‌పీ నాయకుల్లో ఒకరు సీఐ కాలర్ పట్టుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో వారిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అక్కడ వీహెచ్‌పీ నేతల్లో ఒకరు మంత్రి సత్యకుమార్‌కు ఫోన్‌చేసి సీఐకి ఇవ్వగా.. ‘రోజూ చిల్లర తీసుకునే చిల్లరగాడివి’.. అంటూ సీఐను మంత్రి దూషించినట్లు తెలిసింది. ఫోన్ పెట్టేసిన వెంటనే సీఐ.. ‘నేనేమీ చిల్లర తీసుకునే వాణ్ణి కాదు.. నన్ను వేరే స్టేషన్‌కు మార్చుకోమనండి.. ఐదు నిమిషాల్లో వెళ్లిపోతా. పోస్టు పీకి పడేస్తే టీకొట్టు పెట్టుకుని బతుకుతా. మీ అందరిపై కేసు బుక్‌చేసి పడేస్తా. అధికారం ఉంది కాబట్టి కేసు మూసేసుకుంటారేమో.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓపెన్ చేసి పడేస్తా.. ఏం చేస్తారు?’ అంటూ వీహెచ్‌పీ నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు.