AP Minister Ambati Rambabu Slams Chandrababu Naidu Viral - Sakshi
Sakshi News home page

Ambati Rambabu: గెటౌట్‌ చంద్రబాబు.. షటప్‌ చంద్రబాబు!

May 7 2022 8:42 AM | Updated on May 7 2022 12:49 PM

Minister Ambati Rambabu Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నినాదం క్విట్‌ జగన్, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అయితే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విధానం ఏమిటో 2019లో, ఆ తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ చూపించారని జల వనరుల శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ‘షటప్‌ చంద్రబాబు.. గెటౌట్‌ చంద్రబాబు.. బైబై బాబు’’ అని ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా ఆయన సిగ్గుపడటం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో అంబటి తూర్పారబట్టారు. సరఫరా, డిమాండ్‌ మీద ఆధారపడి ధరలు ఉంటాయని, హెరిటేజ్‌ స్టోర్స్‌లో ధరలు మాత్రం బాబు జేబులోకి వచ్చే లాభం మీద ఆధారపడి మార్కెట్‌ ధరకంటే ఎక్కువగానే ఉంటాయని అన్నారు.

బాబు హయాంలో కందిపప్పు డబుల్‌ సెంచరీ కొట్టిందన్నారు. ఆయిల్‌ ధరలు కూడా ఏడేళ్ల క్రితమే ఇప్పుడున్న స్థాయికి చేరాయన్నారు. డీజిల్, పెట్రోల్‌ ధరల్లో ఉన్న ఒక్క రూపాయి, అర్ధ రూపాయి తేడా గురించి మాట్లాడే బాబు.. 2014–19 మధ్య బడ్జెట్లలో ఎంత ఆదాయం వచ్చిందో, 2019 నుంచి నేటి వరకు దాదాపు అంతే ఆదాయం వచ్చిందని గుర్తించాలన్నారు. బాబు హయాంలో కోవిడ్‌ లేదన్నారు. కోవిడ్‌ సంక్షోభాన్ని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అదే ఆదాయంతో ఎదుర్కొందని చెప్పే ధైర్యం ఉందా అంటూ బాబును నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమం రావటం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నారని చెప్పారు. ఇప్పుడు ఆయన గోలంతా దత్త పుత్రుడు, తాను విడిపోయినట్టు ఆడిన డ్రామా ముగించటానికి మరో డ్రామా ఎలాగనే అని ఎద్దేవా చేశారు. నాయకత్వ పటిమ, ప్రజా సంక్షేమ విధానాల ద్వారా అధికారాన్ని తెచ్చుకున్న వైఎస్‌ కుమారుడు జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవటం చేతకాక చేతులెత్తేశారని చెప్పారు. దానికి ఉమ్మడిగా ఎదుర్కోవటం, పొత్తులు అనే పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

బాబే పెద్ద సంఘ విద్రోహ శక్తి
చంద్రబాబుకంటే పెద్ద సంఘ విద్రోహ శక్తి ఎవరుంటారని అంబటి ప్రశ్నించారు. ‘ఎన్ని కేసులుంటే అంత గొప్పవారు అని టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టటం వల్లే కదా.. బాబుకున్న వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ను నమ్ముకొని ఈరోజు పసుపు ఆంబోతులు నేరాలకు బరితెగిస్తున్నది? ఆ నేరాలు చేసిన వారిని, ప్రోత్సహించినందుకు చంద్రబాబును ప్రతి కేసులోనూ నిందితుడిగా చేర్చాలి’ అని చెప్పారు.

అమ్మ ఒడి వంటి ఒక్క పథకమైనా అమలు చేశారా?
‘అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయింది అని బాబు చెబుతున్నాడు. మీ హయాంలో ఇలాంటి ఒక్క పథకమైనా చేతకాలేదని లెంపలేసుకోవాలి. పాలు తాగే నాటి నుంచి కింగ్‌ఫిషర్‌ను చూశానని బాబు అంటున్నారు కాబట్టి ఆయన్ని బుడ్డి బాబు అని, లోకేశ్‌ నాన్న బుడ్డి అని పిలిస్తే  బాగుంటుందన్నారు. అమ్మ ఒడి పథకం వల్ల 7 లక్షల మంది పిల్లలు కొత్తగా చదువుకోవడం కళ్ళకు కనిపిస్తుంటే.. నాన్న బుడ్డి అనడం కంటే నీచం ఉండదన్నారు. చంద్రబాబు చివరి రెండు సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. 2017 నుంచి.. బాబు ఎగ్గొట్టిన దానితో సహా అయిదేళ్ళుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించింది వైఎస్‌ జగన్‌ సర్కారేనని తెలిపారు.

విశాఖలో ప్రభుత్వ ఆఫీసులు కట్టడం నేరమా?
‘రుషికొండ మీద నిర్మాణం చేస్తే విశాఖ పాడైపోతుందా? గవర్నమెంట్‌ ఆఫీసులు కడితే నేరమా? ఆక్రమణ అవుతుందా’ అని ప్రశ్నించారు. దాని పక్కనే చంద్రబాబు చుట్టాల గీతం యూనివర్శిటీ మొదలు... బాబు ఇచ్చిన గవర్నమెంట్‌ స్థలాల లీజులు, విద్యా సంస్థలు, చారిటీలు, టీడీపీ పుట్టినప్పటి నుంచి విశాఖలో చేసిన ఆక్రమణలు.. వీటన్నింటిపై చర్చ జరగాలన్నారు. మనిషి రక్తం మరిగిన పులికి, మనుషులు దొరక్కపోతే ఎలా  పిచ్చెక్కుతుందో.. అధికారం పోయిన చంద్రబాబుకు అలానే పిచ్చి హిమాలయాలకు చేరిందని ఎద్దేవా చేశారు.

‘విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన చంద్రబాబును.. అమరావతి అభివృద్ధి కావాలా లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నాం... ఏం  సమాధానం చెబుతారు’ అని నిలదీశారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈరోజుకు రూ.1.39 లక్షల కోట్లు.. కేవలం 35 నెలల్లో పేదల చేతిలో పెట్టిన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంట నక్కకు తెలియక..  ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన పాలనలో స్కీములు, డీబీటీలు లేవన్నారు. కింది స్థాయిలో జన్మభూమి కమిటీల దోపిడీ,  పై స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల్లో, రాజధాని, ఇసుక, మద్యం పేరిట దోపిడీ జరిగాయని తెలిపారు.

అడ్డంగా దోచేయడానికి కుదరకపోవడంతోనే..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో చంద్రబాబు పాలనలో ఒక్కటయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఏ స్కీములూ లేకపోయినా ఇంతే ఆదాయం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బంతా తినేసినట్లే కదా అని అన్నారు. బాబుకు, ఎల్లో మందకు రాష్ట్రమనే చేలో అడ్డంగా ఆంబోతుల్లా తినే అవకాశం దొరకటంలేదన్న బాధ ఈరోజు విశాఖలో మరీ ఎక్కువగా కనిపించిందని చెప్పారు. ఈరోజు కాకపోతే రేపయినా ప్రజాభీష్టం మేరకు పరిపాలన వికేంద్రీకరణ ఖాయమని, విశాఖకు రాజధాని వెళ్ళటం ఖాయమని అర్థం అవుతుంటే.. అమరావతిలో బినామీల భూములకు రేట్లు పెరగవన్న ఏడుపే చంద్రబాబు విశాఖలో ఏడ్చారన్నారు. దాని కోసం విశాఖను, ఉత్తరాంధ్రను త్యాగం చేయమని అడగడం చాలా నీచమన్నారు.

చంద్రబాబు కంటే ఐరన్‌ లెగ్‌ ఎవరుంటారు?
‘తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి చంద్రబాబుకంటే ఐరన్‌ లెగ్‌ ఎవరుంటారు? ఆయన కొడుకు ఐరన్‌ లెగ్‌–2 అని తెలిసిన తర్వాతే కదా దత్తపుత్రుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన మీద ఆయనకే నమ్మకం లేకే పవన్‌ కల్యాణ్‌కు మళ్ళీ కన్ను కొడుతున్నాడు. ఆయన పాలనలో ఏనాడూ వర్షాలు కురవలేదు. ఏరువాక అంటూ బాబు పాలకొల్లులో అడుగు పెట్టిన పొలం ఎండిపోయింది. రెయిన్‌గన్‌ అని అనంతపురంలో కాలుపెట్టిన పొలం బీడుగా మారింది.

2014లో 102 సీట్లున్న పార్టీకి 2019లో 23 సీట్లు మిగిలాయి. కొడుకు, దత్తపుత్రుడు కూడా ఆయన పాలన దెబ్బకు ఎన్నికల్లో గోవింద కొట్టారు. ఎవరిది ఐరన్‌ లెగ్‌?’ అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడైనా సీఎం పదవి పక్కాగా వచ్చిందా? పక్క నుంచి వచ్చిందా అన్నది అందరికీ తెలుసన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఒక్క మంచి పథకం అమలు చేయలేని ఈ దౌర్భాగ్యుడు.. ఈ రోజు మరోసారి పదవి అడుగుతాడా అని నిలదీశారు. 2019లో, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో ప్రజలు బాదుడే బాదుడు అని బాదేసినా.. ఈ ముసలాయనకు బుద్ధీ జ్ఞానం లేకుండా రోజూ తన మందతో ఏది పడితే అది తిట్టిస్తాడు. తానూ మాట్లాడతాడని మండిపడ్డారు. విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసి అమరావతిలో బినామీ భూముల రేట్ల కోసం చేసే కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement