ఆంధ్రరాష్ట్రానికి పోలవరం.. మణిహారం

Minister Ambati Rambabu Says Responsible For Irrigation Ministry - Sakshi

సత్తెనపల్లి(పల్నాడు): ఆంధ్రరాష్ట్రానికి పోలవరం మణిహారమని, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్తెనపల్లి నియోజవకవర్గానికి చేరుకోవడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన రాజుపాలెం మండలం దేవరంపాడులోని నేతి వెంకన్నస్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణానికి చేరుకోగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చలంచర్ల లక్ష్మీతులసి హారతి పట్టి ఆహ్వానించారు.

నరసరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద నుంచి అశేషజనవాహినితో ర్యాలీగా అమరావతి బస్‌ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక వద్దకు వచ్చారు. హరిమిత్ర మండలి ఏర్పాటు చేసిన భారీ గజమాలను ధరించారు. ఆర్యవైశ్యనాయకులు వెలుగూరి శరత్‌ వెండికిరీటాన్ని మంత్రికి అందించారు. అచ్యుత శివప్రసాద్‌ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. మంత్రి అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని పదవిలా కాకుండా కీలకమైన బాధ్యతగా భావిస్తానన్నారు.

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పోల వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారన్నారు. జలవనరుల శాఖ కీలకమైనదని రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు, నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా పారదర్శకంగా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంస్కరణలతో, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా కోట్లరూపాయలు లబ్ధిదారుల ఖాతాలో చేర్చుతున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

వేదికపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి నిమ్మకాయల రాజానారాయణ, పర్యావరణ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బా చంద్రశేఖర్, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్‌ తాడిశెట్టి మురళి, మున్సిపల్‌ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్‌ రాయపాటి ఫురుషోత్తమరావు, జిల్లా రైతు సలహామండలి సభ్యులు కళ్లం విజయభాస్కరరెడ్డి,  వైస్‌ చైర్మన్‌ షేక్‌ నాగూర్‌మీరా, యువజన నాయకులు అచ్యుత శివప్రసాద్‌ తదితరులున్నారు. గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి,  వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో కలిసి అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top