ఏపీ: ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు

Minimum Pass Marks For AP Intermediate Students - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్‌ విద్యార్థులందరినీ కనీస ఉత్తీర్ణత మార్కులు (మినిమం పాస్‌ మార్కులు)తో సెకండియర్‌ (2021–22)లోకి ప్రమోట్‌ చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఇటీవల ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

రెగ్యులర్‌ సెకండియర్‌ (2020–2021) పూర్తి చేసిన విద్యార్థులకు..
ఐపీఈ మార్చి 2021కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు.. వారి మార్కులు (ఫస్టియర్, సెకండియర్‌) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.
ప్రాక్టికల్‌ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు.
ఐపీఈ–మార్చి 2021/అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
 ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు.
హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావాలి.
విద్యార్థులంతా నైతిక విలువలు (ఎథిక్స్‌), మానవ విలువలు (హ్యూమన్‌ వ్యాల్యూస్‌), పర్యావరణ విద్య (ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల్లో) క్వాలిఫై అవ్వాలి. అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి.
ప్రాక్టికల్‌ పరీక్షల్లో తప్పిన, గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికల్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. 

రెగ్యులర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు..
2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరి ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరూ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్‌లోకి ప్రమోషన్‌
కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు. ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులనే కొనసాగిస్తారు.
ఐపీఈ–2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top