సంక్షేమంతో సమానంగా అభివృద్ధి

Mekathoti Sucharitha Comments On YS Jagan Government - Sakshi

గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన: హోంమంత్రి మేకతోటి సుచరిత 

ఇది మహిళలు, రైతు సంక్షేమాన్ని కాంక్షించే సర్కారు 

‘పశ్చిమ’లో రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

పాల్గొన్న మంత్రులు శ్రీరంగనాథరాజు, వనిత

పోడూరు(ఆచంట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందన్నారు. తమది మహిళ, రైతు సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. ‘దిశ’ యాప్‌ ద్వారా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి, జుత్తుగ, భట్లమగుటూరు గ్రామాల్లో సుమారు రూ.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం ఆమె ప్రారంభించారు. మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

పేదల కల నెరవేరుస్తున్నాం..
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. తొలిదశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలన్నీ సజావుగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. మహిళా సాధికారతతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

అభివృద్ధి పథకాల ప్రారంభం.. 
మల్లిపూడిలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, జుత్తుగలో దాదాపు రూ.1.40 కోట్ల తో నిర్మించిన 5 సీసీ రహదారులను, రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయం పైఅంతస్తు, రూ.13 లక్షల వ్యయంతో నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలను మంత్రులు ప్రారంభించారు. భట్లమగుటూరులో రూ.16 లక్షలతో చేపట్టిన డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.47.2 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రహదారులను ప్రారంభించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జస్టిస్‌ రామస్వామి విగ్రహాలకు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు డి.మహాలక్ష్మి, టి.వీర్రెడ్డి, బి.సుగుణమ్మ, తహసీల్దార్‌ వై.దుర్గాకిషోర్, ఎంపీడీఓ ఆర్‌.విజయరాజు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top