స్నేహశీలీ.. సెలవిక!

Mekapati Goutham Reddy dies of heart attack - Sakshi

గుండెపోటుతో మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఛాతి నొప్పితో సోఫాలో ఒరిగిన మంత్రి

హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

సీపీఆర్‌ నిర్వహించినా దక్కని ఫలితం

నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు, పలువురు ప్రముఖులు

నేడు నెల్లూరుకు భౌతిక కాయం.. రేపు ఉదయగిరిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి 
చిన్ననాటి నుంచే గౌతమ్‌రెడ్డి నాకు బాగా పరిచయం. నా రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, వాణిజ్యం, ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రి, విద్యాధికుడ్ని కోల్పోయాను. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని లోటు. 
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: స్నేహశీలి.. సౌమ్యుడు.. మృదుభాషి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. ఊహించని ఈ విషాదం మేకపాటి కుటుంబంతోపాటు ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.వేల కోట్ల పెట్టుబడులను సాధించి దుబాయ్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం ఉదయమే తిరిగి వచ్చిన ఆయన అంతలోనే అందరినీ వీడి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు విజయవాడ నుంచి హుటాహుటిన విమానంలో హైదరాబాద్‌ చేరుకుని మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసం వద్ద పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కాగా మంగళవారం నెల్లూరుకు భౌతికకాయాన్ని తరలించి బుధవారం ఉదయగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్‌రెడ్డి తనయుడు కృష్ణార్జున్‌రెడ్డి మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

మంచినీళ్లు అడిగి.. 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 48లోని తన నివాసంలో ఉదయం లేచిన తరువాత చలాకీగానే ఉన్న మంత్రి గౌతమ్‌రెడ్డి ఫోన్‌లో పలువురితో మాట్లాడారు. రెండో అంతస్తులో సోఫాలో కూర్చున్న ఆయనకు 7.15 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పిరావడం.. సోఫాలో పక్కకు ఒరిగిపోవడంతో గౌతమ్‌రెడ్డి సతీమణి భార్య శ్రీకీర్తి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్, సిబ్బంది తక్షణమే వచ్చారు. డ్రైవర్‌ నాగేశ్వరరావు తదితరులు ఆయన ఛాతీపై గట్టిగా రుద్దడం ద్వారా ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కోరిక మేరకు మంచినీళ్లు అందించినా తాగలేకపోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే ఆయన్ను అడ్వాన్స్‌డ్‌ కార్డియో లైఫ్‌ సపోర్ట్‌తో ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టీమ్‌తో పాటు ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌లు, స్పెషలిస్ట్‌లు గౌతమ్‌రెడ్డిని బతికించేందుకు  ప్రయత్నించారు. 90 నిమిషాల పాటు కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చికిత్స నిర్వహించినా ఫలితం దక్కలేదు. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. 11.50 గంటలకు గౌతమ్‌రెడ్డి పార్థివ దేహాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు.

పెట్టుబడులతో తిరిగి వచ్చి...
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు గత వారం రోజులుగా దుబాయ్‌ నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గౌతమ్‌రెడ్డి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలను ఒప్పించి రూ.ఐదు వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయమే హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం రాత్రి 9.45 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఉదయం యథావిధిగా కార్యక్రమాలు ముగించుకుని సోఫాలో కూర్చున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. కాగా వ్యాయామం చేస్తుండగా ఆయన ఇబ్బందికి గురైనట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేకపాటి కుటుంబ సభ్యులు ఖండించారు. 

పలువురు ప్రముఖుల నివాళులు..
మృదు స్వభావి మంత్రి గౌతమ్‌రెడ్డి అకాల మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపోలో ఆస్పత్రిలో, నివాసం వద్ద పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, ఎంపీ గల్లా జయదేవ్, జేసీ సోదరులు, మాజీ ఎంపీలు కేవీపీ, మైసూరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, బ్రదర్‌ అనిల్‌కుమార్, వైఎస్‌ అనిల్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ కే.ఆర్‌.సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే వి.నారాయణరెడ్డి, ప్రొటెం చైర్మన్‌ ఆమీనుల్‌ జాఫ్రీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జానారెడ్డి, నిర్మాత సురేష్‌బాబు, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌ తదితరులు నివాళులర్పించారు.

ఓదార్చిన సీఎం జగన్‌ దంపతులు
హైదరాబాద్‌లోని మేకపాటి నివాసం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు విషణ్ణ వదనంతో నివాళులర్పించారు. సీఎం జగన్‌ను చూసి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓదార్చిన ముఖ్యమంత్రి జగన్‌ దాదాపు అరగంట పాటు అక్కడే గడిపి ధైర్యం చెప్పారు. గౌతమ్‌రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం జగన్‌ సతీమణి భారతి కూడా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, ఆదిమూలపు సురేష్‌ తదితరులున్నారు.
మేకపాటి భౌతికకాయం వద్ద విషణ్ణ వదనంతో సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి భారతి 

గౌతమ్‌రెడ్డి మృతి విచారకరం 
గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం 
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్, శిక్షణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి అత్యంత విచారకరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top