త్వరలో ఐటీ పాలసీ విడుదల

Mekapati Goutham Reddy And Roja Talk To Media Over New Industrial Policy - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీని విడుదల చేశామని ప‌రిశ్ర‌మల ‌శాఖ‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కొత్త పారిశ్రామిక పాలసీని అవిష్కరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నేడు విడుదల చేసింది కేవలం పారిశ్రామిక పాలసీ అని త్వరలో ఐటీ పాలసీని కూడా విడుదల చేస్తామని తెలిపారు. కరోనావైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితులను అనువుగా మార్చుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన వాతవరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. (ఏపీ: కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ విడుదల)

గత ప్రభుత్వం చేసినట్టు పారిశ్రామికవేత్తలను మోసం చేయమని పేర్కొన్నారు. తాము పాలసీలో ఏం చెప్తే అది కచ్చితంగా చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. అందుకే తమ పెట్టుబడులు, ఉద్యోగాలపై అబద్ధపు ప్రకటనలు చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికను సిద్ధం చేశాని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు స్కిల్‌మాన్‌ పవర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే పెద్ద రాయితీ పరిశ్రమలకు వేరే ఏమి ఉండదని తెలిపారు. నూతన పారిశ్రమిక పాలసీతో రాష్ట్రంలోని యువతకు ఉద్యోగలు వస్తాయన్న నమ్మకాన్ని కలిగించామని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. (సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ: గౌతమ్‌రెడ్డి)

నూతన పారిశ్రామిక పాలసీపై ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. పారిశ్రామిక పాలసీలో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మహిళలకు పరిశ్రమలు పెట్టేందుకు భూమి ధర, జీఎస్టీ, విద్యుత్, వడ్డీ రాయితీలను ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రోత్సాహకాలను అందించామని తెలిపారు. మొట్ట మొదటిసారి మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కి దక్కుతుందని చెప్పారు. చంద్రబాబులా తాము అబద్ధాలు చెప్పలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నీతి, నిజాయితీ, పారదర్శకతతో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు కేవలం ఆయన పప్పుకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ ఈ పాలసీతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 47వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయించి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. (గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top