మెడి'కిల్స్' | Medical shops that do not comply with regulations | Sakshi
Sakshi News home page

మెడి'కిల్స్'

Aug 2 2025 2:03 AM | Updated on Aug 2 2025 2:07 AM

Medical shops that do not comply with regulations

నిబంధనలు పాటించని మెడికల్‌ షాపులు  

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే విక్రయాలు

ఫిజీషియన్‌ శాంపిళ్లు, కాలం చెల్లిన మందుల అమ్మకాలు 

షాపుల్లో బినామీల దందా  ∙కానరాని ఫార్మసిస్టు 

తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు 

ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న అమాయకులు  

మీకు తల నొప్పి వస్తుందా?.. తరచూ జ్వరం బారినపడుతున్నారా?.. కడుపు, ఒళ్లు నొప్పులతో భరించ లేకపోతున్నారా?.. నిద్ర పట్టడం లేదా?.. మీకు భయమేమీ లేదు.. అనారోగ్య సమస్య గురించి చెబితే చాలు..       ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్‌ షాపుల్లో అన్నిరకాల మందులు ఇచ్చేస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. 

ఏ మందు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా చిత్తూరు జిల్లాలో మెడికల్‌ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదో ఓ సారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపు కోవడం విమర్శలకు తావిస్తోంది.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్‌ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. సేమ్‌ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.. అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. 

జిల్లాలో సుమారు 1,500 వరకు రిటైల్, హోల్సేల్‌ మెడికల్‌ షాపులున్నాయి. అలాగే చాలామంది క్లినిక్‌లోనే మెడికల్‌ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5 వేల నుంచి రూ.లక్ష దాకా వ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారం ఇష్టానుసారంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  

తారుమారు 
డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్టు– 1940, ఫార్మసీ యాక్టు– 1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్‌ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్‌ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తి గత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్‌ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. 

ప్రొఫెషనల్‌ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులను పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.   

ఇదోరకమైన దందా.. 
జనరిక్, నాన్‌ జనరిక్‌ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటీబయాటిక్‌ మందులను డాక్టర్ల సూచనల మేరకు ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇస్తున్నట్లు సమాచారం. 

దీంతో అనవసరంగా యాంటీబయాటిక్‌ మందులు వాడిన వారు సైడ్‌ ఎఫెక్ట్‌తో కొత్తరోగాల బారిన పడుతున్నారు. ఇక బెంగళూరు నుంచి పలు రకాల బ్రాండ్‌ల పేరుతో అనధికారికంగా మందులు, మాత్రలు సరఫరా అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇవీ తక్కువ రేటుకు ఇస్తుండడంతో మార్కెట్‌లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది.  

కలెక్టర్‌ ఆదేశాలతో రెండు నెలలకు క్రితం చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడివీధిలోని రెండు మెడికల్‌ షాపులపై  డ్రగ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో విక్రయానికి అనుమతి లేని మందులను గుర్తించారు. మందులు, మాత్రల విక్రయాలకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేవని తెలుసుకున్నారు. దీంతో ఆ షాపును సీజ్‌ చేయగా..మరో షాపునకు నోటీసులు ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు.. ఇలా వందల సంఖ్యలో మెడికల్‌ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement