పంటల బీమా అమలుకు నోటిఫికేషన్‌ | Measures for the implementation of PMFBY during the Kharif season | Sakshi
Sakshi News home page

పంటల బీమా అమలుకు నోటిఫికేషన్‌

Jul 7 2026 5:41 AM | Updated on Jul 7 2026 5:41 AM

Measures for the implementation of PMFBY during the Kharif season

సీజన్‌ ప్రారంభమైన 40 రోజుల తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలుకు ప్రకటన  

వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు కూడా.. 

ఖరీఫ్‌–2026, రబీ 2026–27కు పీఎంఎఫ్‌బీవై అమలుకు చర్యలు 

ఫసల్‌ బీమాలో చేరని కంపెనీల స్థానంలో కొత్త కంపెనీలకు అవకాశం

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన 40 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అమలుకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా స్వచ్ఛంద నమోదు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కంపెనీలకు ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్‌లో పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌ను మూసేసిన విషయం తెలిసిందే. 

ప్రస్తుత ఖరీఫ్‌–2026 సీజన్‌తోపాటు రానున్న రబీ 2026–27 సీజన్‌ కోసం స్వచ్ఛంద నమోదు బీమా పథకం కింద ఎన్‌రోల్‌మెంట్‌ కోసం పోర్టల్‌ తెరిపించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.250 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. బకాయిలు చెల్లిస్తేగానీ ఏపీలో ఫసల్‌ బీమాలో చేరబోమని కంపెనీలు తేల్చిచెప్పడంతో వాటి స్థానంలో వేరే బీమా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌లో స్వచ్ఛంద నమోదు బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. 

ఇందుకు సంబంధించి సోమవారం జీవోఎంఎస్‌ నంబరు 34ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం గతంలో అమలులో ఉన్న క్లస్టర్లు, పంటలు, బీమా యూనిట్లు, పరిహారం విధానం యథాతథంగా కొనసాగిస్తారు. బీమా అమలులో పాత జిల్లాల ప్రాతిపదికనే కొనసాగించాలని నిర్ణయించారు.  

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి  
2026–27 నుంచి పీఎంఎఫ్‌బీవైలో నమోదు చేసుకునే రైతులకు అగ్రిస్టాక్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదైన ఫార్మర్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో కౌలు రైతులకు ఫార్మర్‌ రిజిస్ట్రీలో చోటు దక్కలేదు. దీంతో వాస్తవ సాగుదారులైన కౌలురైతులతో పాటు అటవీ, దేవదాయ, వక్ఫ్, సొసైటీ, లంకభూములు సాగుచేసే కౌలుదారులకు స్వచ్ఛంద బీమాలో చేరేందుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఫార్మర్‌ రిజిస్ట్రీ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రీమియం బకాయిలు చెల్లించని కారణంగా ఏపీలో ఫసల్‌ బీమాలో చేరేందుకు ఆసక్తి చూపని కంపెనీల స్థానంలో వేరే కంపెనీలకు అవకాశం కల్పించారు. తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల క్లస్టర్‌–9లో ఇప్పటివరకు ఉన్న ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ స్థానంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థను బీమా అమలు సంస్థగా నియమించారు. అలాగే ఫ్యూచర్‌ జనరలి సంస్థ పేరు ఇప్పుడు సెంట్రల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీగా మారినట్లు ప్రభుత్వం తెలిపింది. టెండర్లు పిలవకుండానే కొత్త బీమా కంపెనీలకు అవకాశం 
కల్పించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

గడువు తక్కువ
పీఎంఎఫ్‌బీవైకి ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరి మినహా ఇతర పంటలకు జూలై 31 వరకు, వరికి ఆగస్టు 15 వరకు నమోదుకు అవకాశం కల్పించారు. రబీ సీజన్‌లో వరి మినహా ఇతర పంటలకు డిసెంబర్‌ 15 వరకు, వరికి డిసెంబర్‌ 31 వరకు గడువు నిర్ణయించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా నమోదుకు జూలై 15తో గడువు ముగుస్తుంది. ఖరీఫ్‌–2026కు సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా నోటిఫికేషన్‌ను ప్రభు­త్వం జూలై 6 విడుదల చేసి, ప్రీమి­యం చెల్లింపు గడువును జూలై 15గా నిర్ణయించింది.

దీంతో నమోదుకు తొమ్మిది రోజుల సమయ­మే మిగిలిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ సాగు పనుల్లో నిమగ్నమైన రైతులు.. రైతు ఐడీ, ఈ–పంట నమో­దు, బ్యాంకు ప్రక్రియలు పూర్తిచేసుకుని బీమా ప్రీమియం చెల్లించేందుకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని రైతుసంఘాలు తప్పుబడుతున్నా­యి. చివరి నిమిషంలో జీవో జారీచేయడం వల్ల వేలాదిమంది రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement