
అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం..
సింగిల్ జడ్జి ఉత్తర్వులకు పాక్షిక సవరణ
సాక్షి, అమరావతి :వైఎస్సార్ కడప జిల్లా, సీకేదిన్నె మండల పరిధిలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు చెందిన 63.72 ఎకరాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 30 వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఆ భూమిని అటవీ భూమిగా పేర్కొంటూ స్వాదీనం చేసుకోవాలని కడప కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ, కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీకి ముందున్న యథాతథస్థితిని కొనసాగించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం గురువారం పాక్షికంగా సవరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్‌పై గురువారం జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లకు ఉన్న 201 ఎకరాల భూమిలో 63.72 ఎకరాలు అటవీ భూమి అని తెలిపారు. సజ్జల కుటుంబ సభ్యుల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా, తమ వాదన వినకుండానే కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే పంచనామా కూడా చట్ట విరుద్ధమేనని వివరించారు. పంచనామా కాగితాలపై మాత్రమే జరిగిందని, అధికారులు సర్వే నివేదికను తమకు అందజేయలేదని వాదించారు.
ఈ భూముల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భూమి స్వా«దీనం విషయంలో గత విచారణ సమయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించింది. భూమి ప్రభుత్వ స్వా«దీనంలో ఉన్న నేపథ్యంలో, ఆ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.