ప్రాధాన్యత ప్రాజెక్టుగా మహేంద్రతనయ

Mahendrathanaya as priority project Andhra Pradesh - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శరవేగంగా పనులు

రూ.852.45 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు

ప్రాజెక్టు ద్వారా 24,600 ఎకరాలకు సాగు నీరు, 108 గ్రామాలకు తాగునీరు

శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో సాగు, తాగు నీటి సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు చేపట్టారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడిన నందిగం, పలాస, టెక్కలి, మెళియపుట్టి మండలాల్లో 24,600 ఎకరాలకు సాగు నీరు, 108 గ్రామాలకు తాగు నీరు అందించే మహేంద్ర తనయ ప్రాజెక్టును జలవనరుల శాఖ అధికారులు ప్రాధాన్యత ప్రాజెక్టుగా  చేపట్టారు.

జలయజ్ఞంలో భాగంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు నత్తనడకన సాగింది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృషిపెట్టింది. దివాలా తీసిన పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికి టెండర్‌ షెడ్యూళ్లను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తక్కువ ధరకు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు.

రోజుకు 1200 క్యూసెక్కులు మళ్లించి..
ఒడిశాలోని తుపరసింగి వద్ద పుట్టిన మహేంద్రతనయ గొట్టా బ్యారేజ్‌కు 4 కిలోమీటర్ల ఎగువన వంశధారలో కలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయపై రెగ్యులేటర్‌ నిర్మించి,  అక్కడి నుంచి రోజుకు 1200 క్యూసెక్కులు తరలించేలా 13.52 కిలోమీటర్ల వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా నీటిని తరలించి రేగులపాడు వద్ద 1.76 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు.

రిజర్వాయర్‌ నుంచి ఎడమ కాలువ (11.20 కిలోమీటర్లు) ద్వారా 12,500 ఎకరాలకు, కుడి కాలువ (10.20 కిలోమీటర్లు) ద్వారా 12,100 ఎకరాలు.. మొత్తం 24,600 ఎకరాలకు సాగు నీటితోపాటు 108 గ్రామాలకు తాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.852.45 కోట్లు. వరద కాలువలో ఇప్పటికే 7.27 కిలోమీటర్ల పని పూర్తయింది. మరో 6.3 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉంది.

కాలువపై 26 కాంక్రీట్‌ నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. రిజర్వాయర్‌ పనుల్లో భాగంగా 2.485 కిలోమీటర్ల పొడవున 55.6 మీటర్ల ఎత్తుతో మట్టికట్ట నిర్మించాలి. రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల్లోని 1,059 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటికే 659 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.

ఆయకట్టుకు నీళ్లందించేలా 51.5 కిమీల పిల్ల కాలువల కోసం 373.75 ఎకరాల భూమిని సేకరించాలి. ఈ భూమి సేకరణ, నిర్వాసితులకు పునరావాసంపై అధికారులు దృష్టి సారించారు. మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించి.. శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top