ఇంగ్లిష్‌ కావాలా.. లోకల్‌ కావాలా..!

Liquor Sales In Code Language In Srikakulam - Sakshi

కోడ్‌ భాషలో మద్యం, సారా విక్రయాలు భైరిసారంగపురంలో మందుబాబుల హల్‌చల్‌

మందస : మండలంలోని భైరిసారంగపురంలో మద్యం అక్రమ అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో అధికారులు సరిగ్గా దృష్టి సారించకపోవడంతో నాటుసారా విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. కొంతమంది వ్యాపారులు ఏకంగా మద్యం అమ్మకాలనే వృత్తిగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి బంద్‌ అవుతుండటంతో కొంతమంది వ్యాపారులు ఆంధ్రా, ఒడిశాల నుంచి రహస్యంగా మద్యం బాటిళ్లను తీసుకువస్తున్నారు. అవసరాన్ని బట్టి రూ.60 నుంచి రూ.100 ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ గ్రామానికి నాటుసారా తయారీ చేస్తున్న గిరిజన గ్రామాలు దగ్గరలో ఉండడంతో వ్యాపారులు రాత్రివేళ, వేకువజాములో ద్విచక్ర వాహనాలపై నాటుసారా తీసుకువచ్చి అమ్ముతున్నారు.

మద్యానికి ఇంగ్లీష్‌ అని, నాటుసారాకు లోకల్‌ అంటూ కోడ్‌ల ద్వారా వ్యాపారులు ఇంటి పెరటి వైపు నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆర్మీ, నేవీ, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ వ్యాపారంలో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు సమాచారం. మద్యం, నాటుసారా అమ్మకాలతో స్థానికులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, అధికారులు, ఎస్‌ఈబీ స్పందించి అక్రమ మద్యం, నాటుసారా అమ్మకాలను నిరోధించాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top