‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’ | Lella Appi Reddy Accuses Officials Of Favoring TDP In Voter Roll Revision, Demands SIR Deadline Extension | Sakshi
Sakshi News home page

‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

Jul 5 2026 2:43 PM | Updated on Jul 5 2026 5:35 PM

Lella Appi Reddy on SIR in AP

సాక్షి, తాడేపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీకి ఇబ్బందులు కలిగేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మంత్రులు, టీడీపీ నేతలు పాల్గొంటున్నారు. అధికారులకు మంత్రులు డైరెక్షన్‌ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు’’ అని తెలిపారు. 

కాగితాల మీద రాసుకుంటే సరిపోతుందా?
సర్ ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయని, వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ జరుగుతోందని లేళ్ల అప్పరెడ్డి అన్నారు. ‘‘బీఎల్వోలపై టీడీపీ నేతల బెదిరింపులు పెరిగాయి. చివరికి ఉన్నతాధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గటం దుర్మార్గం. ఎన్యుమనరేషన్ ఫారాలు ఇప్పటికీ చాలామందికి అందలేదు. కానీ 99.11%  ఫారాలను పంపిణీ చేశామని ఎన్నికల కమీషన్ చెబుతోంది. కాగితాల మీద లెక్కలు రాసుకుంటే సరిపోతుందా? 

ప్రజల సందేహాలను ఎన్నికల కమిషన్ ఎందుకు నివృత్తి చేయటం లేదు? ఎన్యుమనేరేషన్ ఫారాలు టీడీపీ ఏజంట్ల దగ్గరే ఉంటున్నాయి. ఈ విషయాలపై ఎన్నిసార్లు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. మంత్రి నారాయణ SIR సమీక్షలో పాల్గొనటంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పని చేస్తోంది? డిజిటలైజేషన్ ప్రక్రియ 48% మాత్రమే పూర్తయిందని ఎన్నికల సంఘం చెప్తోంది. మిగతా 9 రోజుల్లో 52% డిజిటైజేషన్ ఎలా పూర్తవుతుంది?

తమకు అనుకూలంగా పని చేయాలంటూ బీఎల్వోలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. బెదిరింపులు తట్టుకోలేక నరసరావుపేటలో ఒక బీఎల్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. సర్ కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలి. 

గడువును మరో నెల పెంచాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు లేఖ రాశాము. అసలు సర్ ప్రక్రియ ఇంకా జనానికి అర్థం కాలేదు. ప్రజల్లో చైతన్యం తేవటంలో ఎన్నికల కమిషన్ విఫలం అయింది. హడావుడిగా కార్యక్రమాన్ని ముగించేందుకు ఎన్నికల సంఘం చూస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement