పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు? | Layoffs in the Animal Husbandry Department | Sakshi
Sakshi News home page

పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు?

Jun 10 2025 4:41 AM | Updated on Jun 10 2025 4:41 AM

Layoffs in the Animal Husbandry Department

జీతాలిచ్చేందుకు నిధుల్లేవనే సాకుతో తొలగింపు

వీరిలో 28 మంది బీపీవోలు, ముగ్గురు ఐటీ ప్రోగ్రామర్లు 

స్వచ్ఛందంగా వైదొలగాలంటూ నెల రోజుల గడువు

ఉద్వాసనకు ఆదేశాలు జారీ చేసిన పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ 

సాక్షి, అమరావతి: పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు పడబోతోంది. కేవలం జీతాలకు నిధుల్లేవనే సాకుతో వీళ్లని బయటికి పంపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న 28 బిజినెస్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌(బీపీవో) / టెలిఫోన్‌ ఆపరేటర్లతో పాటు ముగ్గురు ఐటీ ప్రోగ్రామర్లు ఇందులో ఉన్నారు. జూలై 7వ తేదీలోగా స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ.దామోదరనాయుడు టెర్మినేషన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. జీతాలిచ్చేందుకు తగినంత నిధులు లేని కారణంగా తొలగించాల్సి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ప్రభుత్వమే కావాలని..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశు బీమా పథకం అమలు కోసం 2023లో పత్రికా నోటిఫికేషన్‌ ద్వారా ఈ 31 మందిని నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఆప్కాస్‌ ద్వారా  నియామక పత్రాలు జారీ చేశారు. ఐటీ ప్రోగ్రామర్లకు రూ.27వేలు, బీపీవోలకు రూ.18వేలు చొప్పున జీతభత్యాలు నిర్ణయించారు. 

పేరుకు బీపీవోలుగా పోస్టింగ్‌లు పొందినప్పటికీ వీరు డైరెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో జూనియర్‌ అసిస్టెంట్ల సేవలన్నీ నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. అయినా వీరంతా నిబద్ధతతో పని చేస్తున్నారు. ఇంతలో జూలై 7వతేదీ నుంచి వీరిని తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ కావడంతో వీరు ఆందోళనకు లోనవుతున్నారు. 

ఉన్న ఫళాన తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు కలత చెందుతున్నారు. కాగా ప్రభుత్వాదేశాల మేరకే ఈ 31మందిని తొలగించారనే ప్రచారం జరుగుతోంది. ఉద్వాసన పలికిన అనంతరం వీరి స్థానంలో కూటమి పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులను నియమించుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement