ఆంధ్రప్రదేశ్‌కు 'క్యూ'

Latin American and West African countries team to visit AP - Sakshi

ప్రకృతి సాగు అధ్యయనం కోసం లాటిన్‌ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల ప్రతినిధుల బృందం రాక 

సాక్షి, అమరావతి: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రసాయన రహిత ఉత్పత్తుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఈ విధానంలో మన రైతులు అవలంబిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం ఈనెల 19 నుంచి వారం రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడంతోపాటు రైతులు, రైతుసాధికార సంస్థ ప్రతినిధులతో జిల్లాల వారీగా సమావేశమై ప్రకృతి సాగు పద్ధతులను అధ్యయనం చేస్తుంది.

ప్రకృతి సాగులో దేశానికే ఆదర్శం 
జీరో బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (జెడ్‌బీఎన్‌ఎఫ్‌) కింద 2016లో శ్రీకారం చుట్టిన ప్రకృతి సాగు ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌)గా అమలవుతోంది. ప్రస్తుతం వరితో పాటు వేరుశనగ, కంది, మినుము, పెసర, పప్పుశనగ, మొక్కజొన్న, రాగి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటలను ఈ విధానంలో సాగుచేస్తున్నారు.

2016లో 700 గ్రామాల్లో 40 వేల మందితో ప్రారంభమైన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం 3,730 గ్రామాల్లో 7.30 లక్షల మంది రైతులు ఆచరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో మరో 530 గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతుల ద్వారా 4.25 లక్షల ఎకరాలకు విస్తరించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. అంతేకాదు.. గాలిలో కర్బన శాతాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఈ సాగు ఇతోధికంగా దోహదపడుతోంది. దీంతో.. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నాయి.

గ్రాండ్స్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో..
ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి సాగుపై అధ్యయనం చేసేందుకు 15 లాటిన్‌ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పాటు నేపాల్‌కు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శిస్తోంది. అమెరికాకు చెందిన గ్రౌండ్స్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న ఈ బృందం రాయలసీమ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు క్షేత్రాలను పరిశీలిస్తుంది.

సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్టీవ్‌ బ్రేసియా సారథ్యంలో నెదర్లాండ్స్, కొలంబియా, నేపాల్, బ్రెజిల్, మెక్సికో, మాలి, ఘన, సెనెగల్‌ తదితర దేశాలకు చెందిన 30 మంది వ్యవసాయ రంగ నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.

ఇక ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్న మహిళా సంఘాల పాత్ర, సాగు విధానాలు, టెక్నాలజీ, ప్రభుత్వ ప్రోత్సాహం, భాగస్వామ్య సంస్థల సహకారం, అమలులో కీలకపాత్ర పోషిస్తున్న సామాజిక సిబ్బంది సేవలు, మార్కెటింగ్‌ విధానాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది.

అంతేకాక.. రైతులు, మహిళా సంఘాలతోపాటు రైతు సాధికార సంస్థ జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో బృంద సభ్యులు భేటీ అవుతారు. అనంతరం.. ఈ సాగు అమలు ప్రణాళిక, లక్ష్యాలు, సాధించవలసిన ప్రగతిపై చర్చించి ప్రణాళిక రూపొందిస్తారు.

ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
ప్రకృతి సాగులో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు మన విధానాలను మోడల్‌గా తీసుకుని వారివారి రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు వివిధ దేశాలు కూడా మనవైపు చూస్తున్నాయి. ఒకేసారి 15 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వస్తుండడం మనకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. 
– టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top