దళితులు, గిరిజనులు, మహిళల ఓట్లే లక్ష్యంగా స్థానిక ఎన్నికల్లో పచ్చమూకల అరాచకాలు
ఎస్సీ కాలనీ పోలింగ్ కేంద్రం మార్పు.. దళితుల ఓట్లను ముందే వేసేసిన వైనం
ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన స్థానంలో పోటీ లేకుండా చేసి ఏకగ్రీవం
ఓటు హక్కు కోసం కలెక్టర్‌ను ఆశ్రయించిన మహిళలపై లాఠీచార్జ్
రిజర్వేషన్ల ఉద్దేశాన్నే దెబ్బతీసిన టీడీపీ నేతల దౌర్జన్యాలు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. స్థానిక పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి తూట్లు పొడిచింది. బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతల అక్రమాలకు వంతపాడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ కాలనీల్లో పోలింగ్ కేంద్రాల మార్పు నుంచి దొంగ ఓట్ల వరకు.. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఏకగ్రీవాల నుంచి మహిళలపై లాఠీచార్జ్ వరకు.. స్థానిక పోరులో అడుగడుగునా బడుగు, బలహీనవర్గాల ఓటు హక్కుపైనే దాడి జరిగినట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
బలహీన వర్గాల ఓట్లే టార్గెట్
గ్రామాల్లో రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల జోలికి వెళ్లకుండా.. ఎదురు తిరిగే శక్తి, ఆర్థిక స్థోమత లేని దళితులు, గిరిజనులు, పేద మహిళల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూలి పనులకు వెళ్లే కుటుంబాలు, మారుమూల తండాల్లో నివసించే గిరిజనులు, ఒంటరి మహిళలు ఓటు హక్కు కోల్పోయినా ప్రశ్నించే పరిస్థితి ఉండదన్న బలహీనతను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్, కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత లేని వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బూత్ మార్చి.. దొంగ ఓట్లు
ప్రకాశం జిల్లా కొర్రపాటివారిపాలెంలో ఎస్సీ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని చివరి నిమిషంలో మరో ప్రాంతానికి మార్చడం వివాదాస్పదమైంది. కాలనీ వాసులు కొత్త కేంద్రానికి చేరుకునేలోపే వారి ఓట్లను ఇతరులు వేసేశారన్న ఆరోపణలు వచ్చాయి. తమ ఓటును వేరేవారు వేసినట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల కాలనీలు, గిరిజన తండాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నట్లు ఆరోపణలున్నాయి. రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు పోలింగ్ కేంద్రాలను మార్చడంతో పలువురు ఓటు హక్కుకు దూరమయ్యారు.
ఎస్టీలను ఊరు దాటించి.. రిజర్వ్‌డ్ స్థానాన్ని కైవసం
నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన జెడ్పీటీసీ స్థానంలో ప్రతిపక్ష అభ్యర్థి పోటీ చేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. పోటీకి అవకాశం లేకుండా చేసి ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఉద్దేశం.. ఆయా వర్గాలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకోవడం. కానీ చిల్లకూరులో జరిగిన పరిణామాలు ఆ స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్టీ మహిళ పదవిలో ఉన్నప్పటికీ, ఆమెను ఎన్నుకునే అవకాశం ఆ వర్గానికి లేకుండా చేయడమంటే రిజర్వేషన్లను అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళలకు ఓటు హక్కు నిరాకరణ..
ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు
కర్నూలు జిల్లా ఎదురుసాపురంలో మహిళలను పోలింగ్ కేంద్రం గేటు బయటే క్యూలో నిలబెట్టి, గేటు మూసివేసి లోపల ఓట్లు వేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. పల్నాడు జిల్లా అమ్ముపల్లెలో ఓటు వేయనివ్వడం లేదంటూ మహిళలు నేరుగా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరిన మహిళలపైనే పోలీసులు లాఠీలు ఝళిపించారన్న ఆరోపణలు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఓటు హక్కు కోసం అధికారులను ఆశ్రయించిన మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి, వారిపైనే బలప్రయోగం చేయడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నామినేషన్ల దశలోనూ మహిళా అభ్యర్థులపై దాడులు, చీరలు లాగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోటీ చేసే మహిళలకే రక్షణ లేకపోతే.. ఓటు వేసేందుకు వచ్చే సామాన్య మహిళలకు భరోసా ఎక్కడన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు సామాజిక న్యాయం..
ఆచరణలో అన్యాయం
ప్రసంగాల్లో సామాజిక న్యాయం, బడుగు వర్గాల సాధికారత గురించి గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో ఆ వర్గాల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీ4 కార్యక్రమంతో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో పేదలు, దళితులు, గిరిజనులు, మహిళల ఓటు హక్కుకే రక్షణ కల్పించలేకపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. స్థానిక పాలనలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన రిజర్వేషన్లను నిరీ్వర్యం చేస్తూ, వారి ఓటు హక్కును హరించే పరిణామాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ‘ప్రజాస్వామ్యంలో సామాన్యుడి చేతిలో ఉన్న \శక్తిమంతమైన ఆయుధం ఓటు. ఆ ఓటునే దూరం చేస్తే సామాజిక న్యాయం నినాదం కేవలం మాటలకే పరిమితమవుతుంది’అని తాజా పరిణామాలపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


