టీడీపీ వర్సెస్‌ బీజేపీ | Land dispute between minister and former ministers followers | Sakshi
Sakshi News home page

టీడీపీ వర్సెస్‌ బీజేపీ

Feb 23 2025 5:06 AM | Updated on Feb 23 2025 5:06 AM

Land dispute between minister and former ministers followers

మంత్రి, మాజీ మంత్రి అనుచరుల మధ్య భూ తగాదా

రచ్చకెక్కిన సత్యకుమార్‌ సన్నిహితులు, పల్లె వర్గీయులు

పెనుకొండలోని కియా వద్ద కొన్నేళ్లుగా తెగని పంచాయితీ

వాటాల తేడాలతో కుమ్ములాటలు

ఇరు వర్గాల ఘర్షణలతో ఇబ్బందులు పడుతున్న రైతులు 

సాక్షి, పుట్టపర్తి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ అనుచరులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుయాయుల మధ్య భూ వివాదం రచ్చకెక్కింది. 

ఇరు వర్గాలు తరచూ ఘర్షణలకు దిగుతుండడంతో చుట్టుపక్కల రైతులు.. కియా కార్ల పరిశ్రమ వద్ద ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా తెగని భూ పంచాయితీతో పదేపదే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం, దారులు మూసేయడం, జేసీబీలతో రోడ్లు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాడ్లు, కర్రలతో గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. 

విలువ పెరగడంతో వివాదం 
కియా కార్ల కంపెనీ వచ్చిన సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి, మరో ముగ్గురు కలిసి సుమారు 251 ఎకరాలు కొన్నారు. అప్పట్లో ఎకరా సగటున రూ.20 లక్షలు కూడా లేదు. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగాయి. మొత్తం భూమిలో రోడ్డు పక్కనే ఉన్నదానిని, ఇతర భూమిని భాగాలుగా చేసి, విలువ కట్టి ఎవరికివారుగా అగ్రిమెంట్లు చేసుకుని కొంత భూమి అమ్ముకున్నారు. 

ప్రస్తుతం రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 50 ఎకరాలపై పల్లె రఘునాథరెడ్డి, ముదిగుబ్బ ఎంపీపీ, బీజేపీ నేత ఆదినారాయణ మధ్య వివాదం రేగింది. ఈ క్రమంలోనే మంత్రి సత్యకుమార్‌ సన్నిహితుడైన ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు ఆదివారం సాయంత్రం కియా వద్ద ఉన్న భూమిలోకి వెళ్లారు. పల్లె రఘునాథరెడ్డి అనుచరుడైన ప్రభాకర్‌ యాదవ్‌పై దాడి చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో తర్వాత సద్దుమణిగింది. 

సీఎం వరకు ఫిర్యాదులు 
వివాదాస్పద భూమిలోకి వెళ్లే రోడ్డును గతంలో మాజీ మంత్రి ధ్వంసం చేయించారు. ఫలితంగా రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఆ మార్గంలో గోదాములకు వాహనాలు వెళ్లడం కష్టమైంది. దీనిపై బాధితులు జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక  సదరు కంపెనీ యాజమాన్యం సీఎం చంద్రబాబుకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించినా.. సరుకు నిల్వ చేసుకునేందుకు వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగిందని వాపోతున్నారు.

ఆదినారాయణ నుంచి ప్రాణ హాని.. 
‘‘ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ నుంచి నాకు ప్రా­ణహాని ఉంది. నవంబరు ఆఖరులో గొడవకు దిగడంతో కియా పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యా­దు చే­శా. కేసు కూడా నమోదైంది’’ అని ప్రభాకర్‌ చెప్పారు. 

‘పల్లె’ చిల్లర వేషాలు మానుకోవాలి.. 
తమ భూమిని ఆక్రమించి పల్లె రఘునాథ్‌రెడ్డి కాంపౌండ్‌ వేయడంతోనే సమస్య వచి్చందని ఆదినారాయణ అంటున్నారు. ఈ తగాదా ఏడేళ్లుగా నడుస్తోందని, పల్లె చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించా. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి సత్యకుమార్‌ జిల్లాకు వచ్చి ఎనిమిది నెలలే అవుతోందని.. వివాదంలోకి ఆయనను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement