మళ్లీ అధికారం వైఎస్సార్‌సీపీదే.. అంచనాలు ఇవే | Sakshi
Sakshi News home page

మళ్లీ అధికారం వైఎస్సార్‌సీపీదే.. అంచనాలు ఇవే

Published Thu, May 23 2024 2:47 PM

Ksr Comments On Exit polls Win Predictions In AP Elections

రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.

⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్‌సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.

⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే,  అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.

⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.

⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్‌సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.

⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్‌సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్‌సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. 

⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్‌సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్‌సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.

⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.

⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.

⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.

⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్‌సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్‌సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement