
సాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు
ఎగువ రాష్ట్రాల నుంచి శ్రీశైలం డ్యాంకు వరద
విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీటి విడుదల
నాగార్జున సాగర్‌కు 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఈనెల చివరి వారంలో ఆయకట్టుకు నీరు వదిలే అవకాశం
సాక్షి, నరసరావుపేట/శ్రీశైలం ప్రాజెక్టు: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ఫలితంగా నదీమతల్లి రాష్ట్రంలోని జలాశయాల వైపు పరుగులు తీస్తోంది. వరద నీటితో ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ డ్యాంలు దాదాపుగా నిండాయి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను తెరవడంతో రాష్ట్రంలోని శ్రీశైలానికి వరదనీరు వస్తోంది. గతేడాది తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పాడవడం, డ్యాం భద్రత దృష్ట్యా 80 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నిలపరాదన్న నిర్ణయంతో శ్రీశైలానికి వేగంగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం ఉదయం 8 గంటలకు 875.6 అడుగులుగా నమోదైంది.
డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.89 టీఎంసీలు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం ఉదయం 68,169 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని రెండు తెలుగు రాష్ట్రాలూ ప్రారంభించాయి. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ వైపు 63,150 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 12.649 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.357 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
సాగర్‌లో 147.82 టీఎంసీలకు చేరిక
నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. గురువారం ఉదయం 8 గంటలకు సాగర్‌లో నీటి మట్టం 519.2 అడుగులు వద్ద నమోదైంది. 147.82 టీఎంసీలు నిల్వ ఉంది. ఎగువన శ్రీశైలం నుంచి 50,771 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండటానికి మరో 164.23 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నారు. ఇప్పటికే క్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ పూర్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈనెల చివరివారంలోగా ఆయకట్టుకు నీరు వదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తుంగభద్ర డ్యాం 20 గేట్ల ఎత్తివేత
సాక్షి,బళ్లారి/హొళగుంద: తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గురువారం మధ్యాహ్నం 33 క్రస్ట్‌గేట్లలో 20 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి దాదాపు 59 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. డ్యాం క్రస్ట్‌గేట్లు బలహీనంగా ఉండటంతో గరిష్ట నీటి నిల్వను 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించి, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు. డ్యాం చరిత్రలో జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇన్‌ఫ్లో 28,932 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 62,766 క్యూసెక్యులుగా నమోదైంది. 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న టీబీ డ్యాంలో ప్రస్తుతం 1625.46 అడుగులతో 78.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఈ సారి దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద ఖరీఫ్‌కు మాత్రమే సాగు నీరివ్వనున్నారు. కాలువకు 10న నీటిని విడుదల చేసి నవంబర్ 30న నిలిపి వేయనున్నారు. అయితే కర్ణాటక రైతు సంçఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.