ఢిల్లీకి వ్యవసాయోత్పత్తులు 

Kisan Train Starts From Ananthpur to Delhi  - Sakshi

సాక్షి, అనంతపురం:  జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఈ నెల 9న ప్రయోగాత్మకంగా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్‌కు కిసాన్‌ రైలు నడిపిన విషయం తెలిసిందే. చీనీ, మామిడి, బొప్పాయి, కర్భూజా, టమాట తదితర ఉత్పత్తులకు ఇక్కడ లభిస్తున్న ధరతో పోల్చుకుంటే ఢిల్లీ అజాద్‌పూర్‌ మండీలో అధిక ధరలు లభించాయి. దీంతో ఈ నెల 19న రెండో కిసాన్‌ రైలు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి జిల్లాలో పండిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా పంపితే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని రకాల ఉత్పత్తులు ప్రయోగాత్మకంగా పంపి మార్కెటింగ్‌ పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

వేరుశనగ, పప్పుశనగ, కందులు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జ, కొర్రలు, అండుకొర్రలు, ఆముదాలు తదితర అన్ని రకాల ఉత్పత్తులు ఐదారు కిలోలు చొప్పున పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన కిసాన్‌రైలులో నలుగురు వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉన్నారు. రెండో సారి వెళ్లే రైలులో ఇద్దరు అధికారులను పంపించి వ్యవసాయ ఉత్పత్తులకు లభిస్తున్న గిట్టుబాటు ధరలు, అక్కడి ప్రజల వినియోగంపై అధ్యయం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా రాజస్తాన్, గుజరాత్‌లో పండే వేరుశనగ, పెద్ద సైజు కాబూలీ రకం పప్పుశనగ వాడుతున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి వారికి పరిచయం చేస్తే కొంత వరకు ధరలు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనుకున్న ఫలితాలు వస్తే భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులు కూడా తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు.  

కిసాన్‌రైలుకు అడ్డంకులు 
భవిష్యత్తులో తమ వ్యాపారాలు, కమీషన్లకు గండిపడకుండా ఉండేందుకు దళారులు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. తమ లారీలు, ట్రక్కులు, ఇతరత్రా సరుకు రవాణా వాహనాలకు బాడుగలు లేకుండా పోతుందని భావించిన కొందరు వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, మధ్య దళారీలు కిసాన్‌ రైలును ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

19న  ఢిల్లీకి కిసాన్‌ రైలు 
 ఢిల్లీకి రెండో విడత కిసాన్‌ రైలు ఈ నెల 19న బయలుదేరుతుందని కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. తొలుత 16న పంపించేందుకు ఏర్పాట్లు చేశామని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 19కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంటకోతకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు పంట ఉత్పత్తులు తడిసి నాణ్యత కోల్పోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో కిసాన్‌ రైలు ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. 

చదవండి: త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top