తల్లీబిడ్డల ఆరోగ్యానికి అభయం.. ‘కిల్‌కారీ’కి శ్రీకారం

Kilkari Introduced For Pregnant And Infants In AP - Sakshi

‘కిల్‌కారీ’ పేరిట వినూత్న కార్యక్రమానికి రూపకల్పన  

వాయిస్‌ కాల్‌తో ఆరోగ్యపరమైన సూచనలు, సలహాలు 

ఎంతో ప్రయోజనకరం అంటున్న వైద్యులు

లబ్బీపేట (విజయవాడ తూర్పు): గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు ‘కిల్‌కారీ’ పేరిట ఆడియో కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల మొబైల్‌కు డాక్టర్‌ అనిత అనే కల్పిత వైద్యురాలి వాయిస్‌తో ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన పోషకాహారం, చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు వంటి అంశాలను  వివరిస్తారు. ఈ సందేశాలు గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. వారిలో తలెత్తే ఎన్నో సందేహాలను నివృత్తి చేసే విధంగా వాయిస్‌ సందేశం ఉంటుందని చెబుతున్నారు.  

గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి.. 
మహిళ గర్భం దాల్చిన నాల్గవ నెల నుంచి పాలిచ్చే తల్లుల వరకు.. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకూ 72 సార్లు మొబైల్‌ సందేశాలు వచ్చేలా కిల్‌కారీ కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారు. ప్రతి ఒక్కరికీ 0124488000 నంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది. ఒకసారి ఫోన్‌ ఎత్తకుండా మిస్‌ అయితే, ఐవీఆర్‌ సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా ఒకేరోజు మూడుసార్లు ఫోన్‌ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మూడు రోజులకు రెండుసార్లు కాల్‌ చేయడానికి ప్రయత్నిస్తుంది. గర్భిణులు, బాలింత కిల్‌కారీ నుంచి కాల్‌ పొందలేకపోయినా, ఆ వారాల సందేశాన్ని తిరిగి వినాలనుకున్నా ఆమె దానిని మళ్లీ వినడానికి 14423కు డయల్‌ చేయవచ్చు. బాలింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను వివరిస్తారు.

కిల్‌కారీపై విస్తృత అవగాహన 
గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ప్రవేశ పెట్టిన కిల్‌కారీ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాం. ఏఎన్‌ఎంలు ప్రతి గర్భిణి, పాలిచ్చే తల్లులను నమోదు చేస్తుండగా, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని వారు తప్పకుండా ఆ సందేశాలు వినేలా అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఆరోగ్యం విషయంలో చేపట్టాల్సిన చర్యలు ఇలా సమగ్ర సమాచారాన్ని కల్పిత డాక్టర్‌ వాయిస్‌తో వారికి చేరవేస్తారు. 
డాక్టర్‌ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌వో, ఎన్టీఆర్‌ జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top