
దళిత ఉద్యమకారుడు,కవి డాక్టర్ కత్తి పద్మారావు
పొన్నూరు: సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల కిందట ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బడుగు, బలహీన వర్గాలకు ఆరి్థకంగా తోడ్పాటునందించిందని, ఎన్నికలకు ముందు బూటకపు మేనిఫెస్టోలు ప్రకటించడంలో చంద్రబాబు ఘనత సాధించాడని దళిత ఉద్యమకారుడు, కవి డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పాలనలో ఉన్న వ్యత్యాసంపై పొన్నూరులోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. అధికార దాహంతో చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.
అంతటి కుట్రపూరితమైన వ్యక్తి దేశంలో మరొకరు ఉండడని చంద్రబాబు అవలంబిస్తున్న వైఖరే నిరూపిస్తోందన్నారు. నీచ నామవాచకాలలో (విషయుక్తమైన మనిషి, అవకాశవాది, కుతంత్రుడు, అబద్ధాలకోరు, ద్వేషం మూర్తీభవించిన రూపం)లో ఘనత సాధించిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో వృద్ధుల్లో మరణాలు తగ్గాయని అభిప్రాయపడ్డారు. ప్రతినెలా 1న ఇంటికి పింఛన్ అందించడం గొప్ప విషయమన్నారు. పచ్చ మీడియా, పెత్తందార్లు కలసి ఉచిత పథకాలపై విష ప్రచారం చేసి వాటిని ఆపాలని చూశారని విమర్శించారు.
14 ఏళ్లు పాలన సాగించిన చంద్రబాబు ఏమీ చేయలేని స్థితిలో, జగన్ పథకాలనే అనుసరిస్తున్నాడనడంలో ఆశ్చర్యం లేదన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన పేదలను గుర్తించి మంజూరు చేసిన సంక్షేమ పథకాలను లబి్ధదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్న ప్రభుత్వ చర్యలతో పేదలు హర్షిస్తున్నారని తెలిపారు. వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఏపీకి శుభపరిణామమని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేయడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో నాణ్యత ప్రమాణాలతో కూడిన వైద్యం ఇంటి వద్దనే అందించడంలో జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రజలకు ఆరోగ్య భరోసా లభించిందన్నారు. పేదల మనుగడకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు ఉచితమని చెప్పడం అవివేకమని విమర్శించారు. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు కూటమి రెట్టింపు ఉచితాలతో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సరైంది కాదని పేర్కొన్నారు.
జనరంజక పాలనతో ప్రజలను మెప్పించి సీఎం కుర్చీ సొంతం చేసుకోవాలిగానీ, సీఎం జగన్‌ను నెట్టేసి చంద్రబాబు ఆ కుర్చీలో కూర్చోవాలనుకోవడం కక్ష పూరిత వైఖరిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తన కారణంగా తెలుగువారి జీవన విధానం దెబ్బతింటోందని అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు.