శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం

Karthika Masam 2022: Dasavidha Harathi Darshan in Srisailam Temple - Sakshi

శ్రీశైలం టెంపుల్‌: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే  దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. 

ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి.  

నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది.  

త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. 

నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి.  

సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది.  

సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది.  

చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి.  

నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.  

కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 

(క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top