జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా? | Kakarla Venkataram Reddy questions Home Minister Anita | Sakshi
Sakshi News home page

జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా?

Jun 5 2026 5:20 AM | Updated on Jun 5 2026 7:22 AM

Kakarla Venkataram Reddy questions Home Minister Anita

హోం మంత్రి అనితకు కాకర్ల వెంకటరామిరెడ్డి ప్రశ్న 

డీఎస్సీ అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ 

సాక్షి, అమరావతి:  చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్ర బ్రష్టుపట్టాయని, ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ‘మెగా డీఎస్సీ పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు.  ఆఖరికి క్రీడల కోటా కింద 52 ముక్కల పేకాట (బ్రిడ్జ్‌) గేమ్‌ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.  

ఇలాంటి నిర్ణయాల వల్ల యువత భవిష్యత్తులో క్లబ్బుల బాట పట్టే ప్రమాదం ఉంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత దానికి సమాధానం చెప్పకుండా, గత ప్రభుత్వం టీచర్లను వైన్‌షాప్‌ల వద్ద కాపలా పెట్టిందని అబద్ధాలు మాట్లాడారు. దీనికి ఆధారాలు చూపిస్తారా? ఇలా జీవితాంతం అబద్ధాలతోనే బతుకుతారా?  ఇలా అబద్ధాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై సూటిగా సమాధానం చెప్పండి. 

నిజానికి మరుగుదొడ్లు, పార్కింగ్‌ స్థలాలు, పెట్రోల్‌ బంకులు, రేషన్‌ షాపుల వద్ద ఉద్యోగులతో అడ్డదిడ్డమైన పనులు చేయించింది చంద్రబాబు సర్కారే. ఇందుకు సహకరించని ఉద్యోగులను అక్రమ కేసులు పెడతామని బెదిరించిన చరిత్ర కూడా చంద్రబాబు ప్రభుత్వానిదే’ అని విమర్శించారు.  

ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు 
చంద్రబాబు సర్కార్‌కు ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని కాకర్ల స్పష్టం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తడిగుడ్డతో ఉద్యోగుల గొంతు కోస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వేధింపులకు గురి చేస్తోంది. ప్రభుత్వంలో ఒత్తిడి భరించలేక 100కు పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన మేలు, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశారో బేరీజు వేసుకుంటే ఎవరు ఉద్యోగులకు మేలు చేశారో తెలుస్తుంది. 

చంద్రబాబు ప్రభుత్వంలో ఐఆర్, పీఆర్‌సీ, డీఏలు లేవు. ప్రమోషన్లు లేవు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. పైగా  రెగ్యులరైజేషన్‌ కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఎల్లో మీడియాలోనే వచ్చింది. ఇలా అడ్డగోలు పనులు చేస్తూ వాటిని ప్రశ్నిస్తే నాలాంటి వారిని డిస్మిస్‌ చేస్తారా?  ప్రజాస్వామ్యంలో  ఇలా ఎక్కడైనా.. ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నించారు.  ఉద్యోగులను అడ్డగోలు పనులకు వినియోగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీడియాకు కాకర్ల చూపించారు. వీటిని హోం మంత్రి అనిత చూడాలని అన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement