
తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజ స్తంభానికి మొక్కుతున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సతీసమేతంగా గురువారం రాత్రి తిరుమల శ్రీవారి ఏకాంతసేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమల చేరుకున్న ఆయనకు శ్రీ పద్మావతి అతిథిగృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. ఆయన స్వామిని దర్శించుకుని ఏకాంతసేవలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలితకుమారి, జిల్లా ప్రధాన జడ్జి రవీంద్రబాబు, కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పవన్‌కుమార్, డీఐజీ క్రాంతిరాణా టాటా, సీవీఎస్‌వో గోపీనాథ్‌జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పాల్గొన్నారు.