సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట హల్చల్ చేశారు. పీఎస్ ముందే మంచం వేసుకుని బైఠాయించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయిన జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలోనే ఆయన అనుచరులు విచక్షణా రహితంగా రాళ్ల దాడులకు పాల్పడ్డారు. తాడిపత్రిలోని గన్నేవారిపల్లి కాలనీలో వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు కార్యకర్తల ఇళ్లపై జేసీ వర్గీయులు దాష్టికానికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు వైఎస్సార్‌సీపీ నేతల నివాసాలపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత ప్రదీప్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
ఈ ఘటనలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు ప్రత్యక్షంగా పాల్గొని దాడులను ప్రోత్సహించినప్పటికీ, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసినా జేసీ వర్గీయులపై కేసులు నమోదు చేయలేదు.
మరోవైపు, స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుండి రాత్రికి రాత్రే బలవంతంగా అనంతపురం తరలించారు. అంతేకాకుండా, కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే ఘటనలో బాధితులు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోగా, విపక్ష నేతలపై ఏకపక్షంగా కేసులు నమోదు చేయడంపై తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి : టీడీపీ వల.. జనసేన విలవిల!


