
జేసీ ట్యాక్స్ కట్టాలంటూ 40 మందితో పవర్‌గ్రిడ్‌పై మూకుమ్మడి దాడి
దొరికిన వారిని దొరికినట్టు చితకబాదిన టీడీపీ గూండాలు
ఓ ఉద్యోగిని కిడ్నాప్ చేసి చావబాది గుత్తి శివారుల్లో పడేసిన వైనం
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లాలో జేసీ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జేసీ ట్యాక్స్ చెల్లించనిదే జిల్లాలో కాంట్రాక్టర్లు పనులు చేయలేరంటూ బహిరంగ బెదిరింపులకు దిగుతున్నారు. వందల మంది అనుచరులతో పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి ఉద్యోగులు, కాంట్రాక్టర్లను బెదిరించి సొమ్ము చేసుకోంటున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారాల గురించి నేరుగా బాధితులే వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా.. జిల్లా ఉన్నతాధికారులూ చేష్టలుడిగి చూసున్నారు.
మూకుమ్మడి దాడి..ఉద్యోగి కిడ్నాప్
అనంతపురం జిల్లా యాడికి మండలం, రాయలచెరువు గ్రామ సమీపంలో అనంతపురం పవర్ గ్రిడ్, కర్నూలు ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ జోన్ కోసం 400/220 కేవీ పూలింగ్ స్టేషన్‌తోపాటు అనుబంధ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 16న జేసీ ప్రభాకరరెడ్డి 40 మంది అనుచరులతో ప్లాంట్‌పై మూకుమ్మడి దాడి చేశారు. సిబ్బందిని కర్రలతో చావబాదారు. ఇంజినీర్లనూ చితకబాదారు. ఇదేం పద్ధతని ప్రశ్నించిన పవర్ గ్రిడ్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అమిత్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి వాహనాల్లో తీసుకెళ్లారు. కారులో అతన్ని చితకబాదారు.
గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై పడేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న వారి సాయంతో అమిత్ యాదవ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయినట్టు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత సిబ్బంది, కార్మికులు పనులకు రావడానికి భయపడుతున్నారు. జేసీ వ్యవహార శైలితో అత్యంత ప్రాధాన్యం కలిగిన ట్రాన్స్‌మిషన్ పనులకు తీవ్ర ఆటంకంగా మారిందని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈనెల 17న కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జేసీని కట్టడి చేయలేకపోతే కీలకమైన సోలార్ ఎనర్జీ జోన్ పనులు చేయలేమని స్పష్టం చేశారు.
రక్షణ కల్పించకపోతే పనులు చేయలేం
జేసీ ప్రభాకర్‌రెడ్డి దాడితో సిబ్బంది వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే జరిగితే ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేం. జేసీతోపాటు నిర్మాణపు పనుల వద్దకు వచ్చి పదేపదే బెదిరింపులకు దిగుతున్న చిన్న దివాకరరెడ్డి, హాజీవలి, నారాయణస్వామి, చౌడయ్యబాబు, రంగయ్యలతోపాటు 40 మందిపై చర్యలు తీసుకోవాలి. పోలీసుల రక్షణ లేకపోతే తాడిపత్రి ప్రాంతంలో పనులు చేయలేం. – హెచ్.కే మౌనాస్, పవర్ గ్రిడ్ అనంతపురం, కర్నూలు ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ జీఎం
రేయ్.. బీ కేర్ ఫుల్!
జిల్లా పంచాయతీ అధికారిపై జేసీ చిందులు
అనంతపురం సిటీ: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి చెలరేగిపోయారు. జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) నాగరాజునాయుడిని టార్గెట్ చేసి చిందులు తొక్కారు. అందరూ చూస్తుండగానే ఆవేశంతో ఊగిపోయారు. నొటికొచ్చినట్లు దుర్భాషలాడారు. గురువారం జరిగిన ఈ ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని డీపీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేచి చూసినా డీపీఓ రాలేదు. ఆయన డీపీఆర్‌సీ భవన్‌లో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు.

అక్కడే ఉన్న డీఎల్పీఓ కార్యాలయంలో డీపీఓతో కాసేపు మాట్లాడారు. అప్పటికే భోజనం సమయం కావడం.. జేసీ చెప్పిందే చెబుతుండటంతో డీపీఓ బయటకు వచ్చేశారు. దీంతో ఆగ్రహించిన జేసీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నేను మాట్లాడుతుంటే వెళ్లిపోతావా రేయ్.. నీకుంది.. నీ కథ చూస్తా.. రెస్పెక్ట్ లేకుండా వెళ్లిపోతావా’’.. అంటూ కేకలు వేస్తూ బూతులు తిట్టారు. బీ కేర్‌ఫుల్ అంటూ హెచ్చరించారు. ఆ తరువాత జేసీ మీడియాతో మాట్లాడుతూ.. డీపీఓనుద్దేశించి ‘వీడు ప్రతి దాంట్లో ఇట్లాగే చేస్తున్నాడు.
మినిస్టర్ దగ్గర నుంచి తాడిపత్రిలో పెద్ద ఫ్రాడ్ జరిగింది. వీడికి భాగముంది. మాట్లాడదామని పిలిచిన ప్రతిసారీ నాకు పనుంది.. నాకు పనుంది అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఏమన్నా... అంటే మీరేమంటారంటే (మీడియానుద్దేశించి).. అరసినాడు. బరిసినారంటారు. నేను మాట్లాడుతుంటే లేచి వస్తాడా? ఎంత ధైర్యం’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ తతంగమంతా ఉద్యోగులు, జెడ్పీకి వచ్చిన వారంతా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు.