మా ఇళ్ల వద్ద ఫొటోలు ఎలా దిగుతారు?: జనసేన నాయకుల​కు షాక్‌

Janasena Party Leaders Over Action At Krishna District Pedana - Sakshi

జనసేన నాయకులను నిలదీసిన లబ్ధిదారులు

చేసేదిలేక తిరుగుముఖం

కృష్ణాజిల్లా పెడన జగనన్న కాలనీలో ఘటన 

రాజమహేంద్రవరంలో పార్టీ అభిమానితో అసత్యాలు చెప్పించి షూటింగ్‌

పెడన/రాజమహేంద్రవరం రూరల్‌:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదల పక్షాన నిలబడి అర్హులకు స్థలాలిచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారా? అంటూ జనసేన నేతలను లబ్ధిదారులు నిలదీశారు. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని జనసేన నేతలు రామ్‌సుధీర్, రమాదేవి తదితరులు శనివారం ఉదయం పట్టణ శివారులోని పల్లోటి లేఅవుట్‌–2 వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు.

అదే సమయంలో అక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్న పలువురు లబ్ధిదారులు ఫొటోలు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులకు, కౌన్సిలర్లకు మాట్లాడే పనిలేదని, మీకు ఇక్కడ ఏం సంబంధం అంటూ నల్లా నాగలక్ష్మి, షాహినాబేగంలను ప్రశ్నించారు.

దీంతో వారిద్దరూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరేం మాట్లాడుతున్నారు.. మేం ఎవరని ప్రశ్నిస్తున్నారేంటి? అసలు మీరెవరు? మా ఇళ్ల దగ్గరకు ఎందుకొచ్చారు? ఫొటోలు ఎందుకు దిగుతున్నారు? లబ్ధిదారులైన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేంటి’ అంటూ ఎదురుతిరిగి గట్టిగా నిలదీశారు. దీంతో.. సమస్యలుంటే చెప్పాలని జనసేన నేతలు కోరారు.

సమస్యలేమి లేవని లబ్ధిదారులు గట్టిగా బదులివ్వగా చేసేదిలేక వారు వెనుదిరిగారు. అనంతరం ఒకటో వార్డులోని పైడమ్మ లేఅవుట్‌ వద్దకు కూడా వారు వెళ్లి తాపీ పనివారితో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో స్థానికుల జోక్యంతో సద్దుమణిగింది. 

రాజమహేంద్రవరంలో ఇలా.. 
మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు టిడ్కో గృహ సముదాయం వద్ద కూడా జనసేన నేతలు ఓవరాక్షన్‌ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిటీ ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, అర్బన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు శనివారం ఉదయం టిడ్కో గృహ సముదాయంలోని కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడున్న మహిళలను ఉద్దేశించి జనసేన నేతలు ‘మిమ్మల్ని ఇప్పుడే పిలిచారా అంటే.. వెంటనే ఆ మహిళలు తమకు ఆగన్టులోనే ఇళ్లు అందజేశారని, కానీ.. తామే ఇంకా దిగలేద’న్నారు. అయినా ఇళ్లను ఎందుకు అప్పగించలేదంటూ అధికారులతో జనసేన నేతలు వాదనకు దిగారు. అక్కడ కొద్దిసేపు నినాదాలుచేసి సీ–బ్లాకు వద్దకు వచ్చారు.

అక్కడ ఆ పార్టీ అభిమాని లలితను ఆమె ఫ్లాట్‌ కాని జీఎఫ్‌8 వద్ద నిలబెట్టి సమస్యలున్నాయంటూ ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెప్పించారు. తీరా చూస్తే ఇంటి ప్లాన్‌లోనే లేని బాల్కని కావాలని ఆమె సమస్యగా పేర్కొంది. ఆ తర్వాత.. ట్విట్టర్‌లో పెట్టేందుకు అంటూ మళ్లీ అనుశ్రీ సత్యనారాయణ అక్కడకొచ్చి లలితతో మళ్లీ అదే సమస్య చెప్పించి షూట్‌ చేశారు. 

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేస్తున్నారు 
వారు స్థలాలివ్వరు. ఇచ్చిన వాటిని సక్రమంగా చూపడంలేదు. పక్కనే చెరువులను చూపి ఫొటోలు దిగుతూ చెరువుల్లో స్థలాలు ఇచ్చారంటూ టీవీలకు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. 
– నల్లా నాగలక్ష్మీ, లబ్ధిదారురాలు, పెడన 

వారికేంటి సంబంధం? 
మా స్థలాల వద్దకు వచ్చి మీకు సంబంధంలేదని ఎలా అంటారు? పార్టీలకు అతీతంగా అందరికి ఇళ్ల స్థలాలిస్తే వీరికి వచ్చిన బాధ ఏమిటో? మరీ ఇంత అన్యాయంగా ఫొటోలు దిగి టీవీలకు ఫోజులిస్తుంటే వారిని ఏమనాలి? 
– షాహినాబేగం, లబ్ధిదారురాలు, పెడన 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top