Big Shock To Janasena Party: జనసేనకు ఝలక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన మాదాసు గంగాధరం

సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ‘చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకూలంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదని ఒక్కమాట చెబితే ప్రకటన ఇద్దామని తాను గతంలో పవన్‌కు ఎన్నిసార్లు సూచించినా కనీసం పట్టించుకోలేదు.’ అని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ గంగాధరం అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాదాసు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప, తనకు తానుగా ఏమి చేసుకోలేరని విమర్శించారు. ఆయన్ను నమ్ముకుని కొంతమంది ఉద్యోగాలను కూడా వదులుకుని బయటకు వచ్చారన్నారు. కానీ వారిని నట్టేట ముంచాడన్నారు. నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌ను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతూ బాస్‌కు జనం వస్తున్నారులే, గ్రామస్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని గుర్తుచేశారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్‌కు సూచించినా కనీసం పట్టించుకోలేదన్నారు. కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్ చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే కొద్దినెలలుగా జనసేనకి దూరంగా ఉంటున్నానని చెప్పారు.
సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటా
బాలినేని, పెద్దిరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతంలోనే తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని మాదాసు తెలిపారు. ఇప్పటికే తన కుమారుడు మాదాసు పవన్ వైఎస్సార్‌సీపీలో ఉన్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు.