పట్టణాలకు దీటుగా పల్లెలు

Jagananna Swachha Sankalpam for clean villages from July 8 - Sakshi

పరిశుభ్రమైన గ్రామాల కోసం జూలై 8 నుంచి ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’

ప్రజలను భాగస్వాములను చేసే బాధ్యత సర్పంచ్‌లదే 

11,412 మంది సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ బదలాయింపు పూర్తి 

మిగిలిన వారికి ఒకటి, రెండు రోజుల్లో.. 

పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లు ఇచ్చాం 

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్‌లు తాడేపల్లి కమిషనర్‌ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్‌ జగన్‌ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు.  

పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి 
గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్‌లకు సూచించారు.   

11,412 మంది సర్పంచులకు చెక్‌ పవర్‌.. 
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్‌ పవర్‌ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే   బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్‌లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్‌ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్‌ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్‌ సర్పంచ్‌ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్‌ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్‌ ఎస్‌. సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.

రీచ్‌ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక
విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్‌ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్‌ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్‌కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top