జగనన్న కాలనీలు: ‘తూర్పు’లో ఉగాదికి రెడీ

Jagananna Colonies In East Godavari To Ready Move For Ugadi - Sakshi

జగనన్న కాలనీల్లో సిద్ధమవుతున్న  6,319 ఇళ్లు 

పండగ నాటికి గృహప్రవేశాలకు విస్తృత ఏర్పాట్లు

వచ్చే నెల 29 నాటికి పనులు పూర్తి చేయడంలో అధికారుల తలమునకలు

సాక్షి, రాజమహేంద్రవరం:  ఉగాది పండగ నాటికి లబ్ధిదారులను శాశ్వత గృహ యజమానులుగా మార్చేందుకు, తద్వారా వారి కుటుంబాల్లో పండగ సంతోషాన్ని సంపూర్ణంగా నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యాన్ని ఉగాదికి ఒక రోజు ముందే అధిగమించే ఏర్పాట్లలో జిల్లా అధికారులు తలమునకలవుతున్నారు.

జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న పేదల ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాలనీల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేస్తున్నారు. మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి గృహ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి అవగాహన కల్పించి, నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండటంతో లబ్ధిదారులు సైతం ముందుకు వస్తున్నారు. 

ఉగాదికి 6,319 గృహ ప్రవేశాలు 
పేదలకు శాశ్వత నివాసం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మందికి ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. వీటిలో తొలి దశలో రూ.113.48 కోట్లతో 63 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మరికొన్నింటిలో లబ్ధిదారులు గృహప్రవేశాలు సైతం చేసుకున్నారు.

మిగిలిన వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఉగాది నాటికి 6,318 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికార యంత్రాంగం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,211 ఇళ్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగిలిన 5,107 నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలంలో హౌసింగ్‌ అధికారులు, తహసీల్దార్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం 
జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికి బోర్లు తవ్వుతున్నారు. తాగు, ఇతర అవసరాలకు నీటిని సమకూరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో నివసించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

అనపర్తి, బిక్కబోలు, తొర్రేడు, చాగల్లు, కొవ్వూరు కృష్ణారావు చెరువు, కడియం, దామిరెడ్డిపల్లి, నిడదవోలు వైఎస్సార్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి. జగనన్న కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించే పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 755 కాలనీల్లో రూ.411 కోట్ల అంచనాతో పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో సైతం అధునాతన విధానం అవలంబిస్తున్నారు. మూడు పెద్ద లే అవుట్లు అయిన కొమరగిరి, వాకలపూడి (కాకినాడ), వెలుగుబంద (రాజానగరం) జగనన్న కాలనీల్లో ప్రయోగాత్మకంగా భూగర్భ విద్యుత్‌ సరఫరాకు కార్యాచరణ సిద్ధమైంది. 

ప్రతి వారం లబ్ధిదారులతో ముఖాముఖి 
ఉగాది నాటికి గృహప్రవేశాలకు ముమ్మర కసరత్తు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. మిగిలినవి కూడా వేగవంతం చేసేందుకు ప్రతి శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరుతున్నాం. ఇల్లు కట్టుకుంటే బిల్లు సకాలంలో వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైతన్యం తీసుకువస్తున్నాం. ఉగాది నాటికి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి గృహప్రవేశాలు చేపడుతాం. జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 13,019 ఇళ్లకు విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 
– కె.మాధవీలత, కలెక్టర్‌ 

లక్ష్యాన్ని అధిగమిస్తాం
ఉగాది నాటికి ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అధిగమిస్తాం. జిల్లా వ్యాప్తంగా 6,318 గృహప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటికే 1,211 పూర్తి చేశాం. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రత్యేక హౌసింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తూ లబ్ధిదారులను చైతన్యపరుస్తున్నాం.
– జి.పరశురాం, ఇన్‌చార్జి హౌసింగ్‌ పీడీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top