ఈ ప్రభుత్వం వల్లే బతికున్నా..  | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వం వల్లే బతికున్నా.. 

Published Sun, Feb 4 2024 4:37 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

ఈ ప్రభుత్వం వల్లే బతికున్నా.. 
క ర్నూలు ఇందిరా గాంధీ నగర్‌ కాలనీ  మార్కెట్‌ యార్డుకు నా ఎద్దుల బండితో సరుకు రవాణా చేస్తుండేవాడిని. రోజుకు అన్ని ఖర్చులు పోను రూ.500 నుంచి రూ.700 వరకు మిగిలేది. సీజన్‌లో కాస్త ఎక్కువే మిగిలేది. దాంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. గత నవంబర్‌ 5వ తేదీ ఉదయం ఎద్దుల బండిపై వెళ్తుంటే ఒళ్లంతా చెమట్లు పట్టాయి. ఒక చేయిలో పటుత్వం తగ్గుతోంది. ఏమీ తోచలేదు. వెంటనే బండి ఓ పక్క ఆపేశా. నా పరిస్థితి చూసి అక్కడివాళ్లు దగ్గరలోని మెడికవర్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేశారు.

రక్తనాళాల్లో సమస్య ఉన్నట్టు చెప్పారు. శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అప్పుడే నా ఊపిరి ఆగినంత పనయింది. అంత డబ్బు ఎలా తేగలనని భయపడ్డా. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామన్నారు. అదే నెల 18న గుండెకు శస్త్రచికిత్స చేశారు. కాస్త కోలుకోవడంతో పది రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేశారు. ఇందుకోసం రూ.1,18,881 ఖర్చయ్యిందట. అంతా ప్రభుత్వమే ఇచ్చింది. రెండు నెలల నుంచి నేను ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నా. అయినా నా భుక్తికి లోటు లేకుండా ఆరోగ్య ఆసరా కింద రూ.9,500 నా బ్యాంకు ఖాతాలో పడింది.

నా భార్య సుజాత పొదుపు సంఘంలో సభ్యురాలు. ఆమెకు ఇప్పటి వరకు వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.36 వేలు వచ్చింది. మా పాప చదువుకుంటున్నందున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తోంది. నాకే కాకుండా నా కుటుంబానికి కూడా ప్రభుత్వం  దన్ను ఉండడంతో ధైర్యంగా ఉన్నా. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని చక్కగా అమలు చేయడం వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను.       – ధనిగల శ్రీనివాసులు, కర్నూలు (జె.కుమార్, విలేకరి, కర్నూలు హాస్పిటల్‌) 

పేదరికాన్ని జయించాం 
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం మాది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మా లాంటి పేదలకు ఎలాంటి సాయం, పథకాలు అందక బతకడం కష్టంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా జీవితాలే మారిపోయాయి. పేదరికాన్ని జయించి మధ్య తరగతి కుటుంబంగా ఎదిగాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామానికి చెందిన నాకు వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ 18,750 చొప్పున మూడు దఫాలుగా రూ.56,250 వచ్చింది.

ఈ సొమ్ముతో రెండు పాడి గేదెలు కొనుగోలు చేశాం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే నా భర్తకు వృద్ధాప్య పింఛను మంజూరైంది. జనవరి నుంచి అది రూ.3 వేలకు పెరిగింది. మాకు 20 సెంట్లే భూమి ఉన్నప్పటికీ ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వంతున వస్తోంది. డ్వాక్రా రుణమాఫీగా వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా రూ.8 వేలు వచ్చింది. గతంలో అప్పులు ఉండేవి. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్‌ చేయూత, రైతు భరోసా,  పింఛను కానుక, ఆసరా వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. అప్పులు లేకుండా జీవిస్తున్నాం. గేదెలు చూడి దశలో ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.   – పర్రే నాగమణి, గాదిరాయి (కరణం నారాయణరావు, విలేకరి, మాడుగుల) 

చీకూచింతా లేకుండా బతుకుతున్నాం 
మేము గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో ఉంటూ పుస్తకాల బైండింగ్‌ పనులు చేస్తుంటాం. మా ఆయన వెంకటేశ్వరరావు, నేనూ ఇద్దరం కష్టపడితేనే రోజు గడిచేది. బైండింగ్‌ పని ఆదాయం ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోయేది. పిల్లల చదువులకు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వచ్చేది. దానికీ ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టాల్సి వచ్చేది. ఏళ్లు గడుస్తున్నా జీవితం ఎదుగూ బొదుగూ లేకుండా పోయిందనే నిస్పృహలో ఉండేవాళ్లం.

జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఏటా రూ.15 వేల చొప్పున వచ్చింది. నిధులతో బైండింగ్‌ వ్యాపారాన్ని విస్తరించాం. రోజూ వచ్చే ఆదాయం కూడా పెరిగింది. డ్వాక్రా సభ్యురాలిగా రూ.2 లక్షల రుణం వచ్చింది. ఆ మొత్తంతో వ్యాపారం మరింత అభివృద్ధి చేశాం. ఇంజినీరింగ్‌ చదువుతున్న మా కుమార్తెకు విద్యాదీవెన, వసతి దీవెన పథకం కింద నిధులు వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి అండగా నిలిచాయి. ఇప్పుడు చీకూచింతా లేకుండా జీవించగలుగుతున్నాం. జగనన్న మేలు ఎన్నటికీ మరువలేం.     – అవనిగడ్డ నాగమణి, తెనాలి (ఆలపాటి సుదీర్‌ కుమార్, విలేకరి, తెనాలి అర్బన్‌)  

Advertisement
 
Advertisement