Jackfruit: ఆరోగ్యానికి కేరాఫ్‌ పనస

Jackfruit is too good for health of diabetics - Sakshi

వ్యాధుల నియంత్రణకు చక్కటి మార్గం

ముఖ్యంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు వరం

ధ్రువీకరించిన అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌

మంచి ఆహారం జాబితాలో చోటు

సాక్షి, అమరావతి: రోజువారీ ఆహారంలో పనసపొడిని కలుపుకుని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రించడంతో పాటు రక్తపోటునూ నివారించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. పనస పొడిలో ప్రోటీన్‌ కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇది ‘తీపి’ కబురు.

ప్రతి రోజూ 30 గ్రాములకు తగ్గకుండా పనస పొడిని ఆహారంలో కలిపి మూడు నెలల పాటు తీసుకుంటే షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చునని ఇటీవల జరిగిన పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ (ఏడీఏ) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) మంచి ఆహారం జాబితాలో మన పనస (జాక్‌ఫ్రూట్‌)కు చోటు దక్కడమే ఇందుకు నిదర్శనం.

పరిశోధనలు తేల్చిన నిజం..
కరోనా జనాన్ని హడలెత్తిస్తున్న నేపథ్యంలో చాలా మంది వాళ్లకు తెలియకుండానే షుగర్‌ పేషెంట్లు అయ్యారు. అంతకుముందే ఉన్న వాళకైతే మరింత పెరిగింది. ఏపీ, తెలంగాణలోనైతే ఈ బెడద మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఏపీకి చెందిన డాక్టర్లు కొందరు దీనిపై దృష్టి సారించారు. వారిలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన జనరల్‌ మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోపాలరావు, మహారాష్ట్ర పుణెలోని చెల్లారామ్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో డాక్టర్‌ ఏజీ ఉన్నికృష్ణన్‌ ఉన్నారు. షుగర్‌ బెడద తగ్గించడానికి ఏమైనా పండ్లు పనికి వస్తాయా? అని పరిశోధన చేశారు.

అప్పుడు బయటపడిందే ఈ పనస ప్రయోజనం. వాళ్లు కనిపెట్టిన అంశాలన్నింటినీ ఇటీవల అంతర్జాతీయ సైన్స్‌ పత్రిక నేచర్‌ ప్రచురించింది. వారం పాటు క్రమం తప్పకుండా పసన పొడిని తింటే రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ తగ్గినట్టు కనుగొన్నారని నేచర్‌ పత్రిక వివరించింది. ఈ విషయాన్ని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ (ఏడీఏ) ధ్రువీకరించింది. 

ఎలా తీసుకోవాలంటే.. 
ఇటీవలి కాలంలో చాలామంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు బియ్యానికి బదులు చిరు ధాన్యాలను వాడుతున్నారు. వాటితో పాటు పనసపొడిని కలుపుకుని తింటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్న వారిపై వరుసగా ఏడు రోజుల పాటు పనస పొడి ప్రయోగం చేసిన తర్వాత షుగర్‌ లెవెల్స్‌ తగ్గినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. పైగా పనస పొడి వాడకం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. పండిన పనస తొనలను తింటే షుగర్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే పక్వానికి వచ్చిన కాయల నుంచి పనస పొడిని తయారు చేస్తారు కాబట్టి షుగర్‌ నియంత్రణలో ఉంటుంది.  పనస గింజ ల్ని కూడా ఎండబెట్టి కూర వండుతారు. మొత్తంగా పనస కాయ చాలా రకాలుగా.. వ్యాధి నిరోధకశక్తిగా పనికి వస్తుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top