
విశాఖ జిల్లాలో ఘోర దుర్ఘటన
రూ.కోట్ల విలువైన నిత్యావసరాలు భస్మీపటలం
తగరపువలస: విశాఖజిల్లాలో ఐటీసీ గిడ్డంగి దగ్ధం కావడంతో రూ. కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు భస్మీపటలం అయ్యాయి. ఉపాధి కల్పనపైన కూడా ప్రభావం చూపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, గండిగుండం పంచాయతీలోని రామవరం రోడ్డులో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐటీసీ గిడ్డంగి శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ గిడ్డంగి ఉత్తరాంధ్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ కేంద్రంగా పనిచేస్తోంది. నూతన్ రాజ్‌మని ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మిస్టర్ రాఘవా ఇన్‌ఫ్రా శ్రీదత్తా మెడోస్ పేరుతో ఈ గిడ్డంగి ఉంది. ఈ గిడ్డంగిలో సుమారు 300 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు– సాల్ట్, గోధుమపిండి, వంటనూనె, సబ్బులు, మసాలాలు, పసుపు, అగరబత్తీలు, సిగరెట్లు, ఫ్లోర్ క్లీనర్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, నూడిల్స్, ఎనర్జీ డ్రింకులు అన్నీ పూర్తిగా కాలిపోయాయి.
అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలంలో ఉన్న ఒక లారీకి నిప్పు అంటుకుని అందులో ఉన్న మసాలా పదార్థాలు, ఆటా, పసుపు, కారం తదితర వస్తువులు కాలిపోయాయి. సమీపంలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు ఎనిమిది అగ్నిమాపక శకటాలను రప్పించి తెల్లవార్లూ మంటలు ఆర్పడానికి శ్రమించినా, శనివారం మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదం గురించి ముందుగా స్పందించిన స్థానిక సర్పంచ్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్ ఆనందపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు.