ఏ 'మాత్ర'o తగ్గలేదు! | Invisible GST reduction on sales of medicines and pills | Sakshi
Sakshi News home page

ఏ 'మాత్ర'o తగ్గలేదు!

Oct 8 2025 5:49 AM | Updated on Oct 8 2025 5:49 AM

Invisible GST reduction on sales of medicines and pills

మందులు, మాత్రల విక్రయాల్లో కనిపించని జీఎస్టీ తగ్గింపు 

పాత ధరలతోనే అమ్మకాలు  

మెడికల్‌ షాపుల్లో కనిపించని తగ్గింపు బోర్డులు 

తనిఖీ చేయని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు

జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త స్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే మెడికల్‌ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు కనిపించని పరిస్థితి నెలకొంది. పాత ధరలతోనే కొనుగోలు చేసి జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకపోగా.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో దాదాపు 1,500 మెడికల్‌ స్టోర్లు, 200పైగా హోల్‌ సేల్‌ షాపులున్నాయి. వీటి ద్వారా రోజువారీ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా ట్యాక్స్‌ ఎగ్గొట్టాలని చాలామంది  మెడిసిన్‌ కొనుగోలుపై బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించక పోవడం ఆందోళన కలిగిస్తోంది. 

బేరాల్లేవ్‌! 
చాలా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్‌ షాపులు నడుపుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో  చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్‌పీకే విక్రయిస్తున్నారు.  

నిబంధనలు పాటించరే  
మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్‌ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడా ఈ బోర్డులు కనపించడం లేదు. దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదు. అధికారుల వత్తాసు ఉందని జీఎస్టీకి తూట్లు పొడుస్తున్నారు. ప్రజలను మందులు, మాత్రలతో మాయ చేస్తున్నారు. 

జీఎస్టీ తగ్గింపు ధరలు అమలుపై నిఘా కొరవడింది. ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణలో ఎక్కడా తనిఖీలు గానీ, సోదాలు గానీ చేసినట్లు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు అమలయ్యేలా చూడాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.  

పాత మందులంటూ బూచీ 
జీఎస్టీ తగ్గింపు కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందుల ధరలు తగ్గుతాయనే ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయింది. మందుల షాపుల యాజమా నులు పాత స్టాక్‌ పేరు చెప్పి ఆ ధరలకే విక్రయిస్తున్నారు. పాత స్టాక్‌ పూర్తయిన తర్వాతే కొత్త ధరలు అమలవుతాయని బుకాయి స్తున్నారు. పాత స్టాక్‌ నిల్వలపై కొత్త ధరలు వర్తింపజేయడానికి నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. ఈ విషయా న్ని సంబంధిత డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లైట్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

తగ్గింపు ధరలు అమలు కావాలి  
ఇప్పుడున్న రోజుల్లో తిండికంటే ముందు ముఖ్యమైనవి మందులు, మాత్రలు. ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి. మందులు, మాత్రలకు పేద కుటుంబాల వారు కూడా నెలవారీగా వేలల్లో ఖర్చు చేస్తున్నా రు. జీఎస్టీ ఊరటతో కాస్త తగ్గుతుందని అనుకుంటే..ఇంకా మందుల దుకాణాల్లో పాత ధరలే అమలవుతున్నాయి. అధికారులు స్పందించి జీఎస్టీ తగ్గింపు వర్తించేలా చూడాలి.  – రాజారత్నంరెడ్డి, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement