
ఉదయగిరి చైర్మన్ శాంతమ్మకు రాకుండా కాకర్ల కుతంత్రం
ఆమెకు కాకుండా పార్టీలో మరొకరికి ఇస్తే ఇబ్బందులని..
బీజేపీ నేత విజయలక్ష్మికి కేటాయించేలా వ్యూహం
మేకపాటి చంద్రశేఖరరెడ్డికి రాజకీయంగా చెక్ పెట్టే ప్రయత్నం
నెల్లూరు జిల్లా: ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీలోనే కాకుండా కూటమిలో భాగస్వామి అయిన బీజేపీలోనూ కుంపటి రాజేస్తోంది. ఆ పదవి తన సతీమణి మేకపాటి శాంతకుమారికి దక్కే లా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఇప్పటికే పావులు కదిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మేకపాటిని రాజకీయంగా దూరంగా చేయాలని తాజా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుతంత్రాలకు తెరతీశారు.
ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ మహిళకు కేటాయించడంతో పార్టీ అధిష్టానం వద్ద ఉన్న పరపతితో వింజమూరుకు చెందిన టీడీపీ నేత గణపం సుదర్శర్‌రెడ్డి సతీమణి హరిత పేరును ఎమ్మెల్యే సిఫార్సు చేశారు. ఈ క్రమంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసి ఉదయగిరి ఏఎంసీ పదవి తన సతీమణికి ఇవ్వాలని నివేదించినట్లు సమాచారం. ఉదయగిరి అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను తమ కుటుంబ కలహాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరాను. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా భేషరతుగా టీడీపీ విజయం కోసం పని చేశాను.
తమ కుటుంబం నుంచి తన సోదరుడు పోటీ చేిసినా, టీడీపీ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం శ్రమించాను. ప్రస్తుతం ఈ అవకాశం తన సతీమణికి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల కుట్రలకు తెరతీసినట్లు సమాచారం. మేకపాటి శాంతకుమారికి చైర్మన్ పదవి ఇస్తే ఉదయగిరిలో గ్రూపు రాజకీయాలు పెరుగుతాయని, ఈ పరిణామాలు భవిష్యత్‌లో టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ ద్వారా మేకపాటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తాను సూచించిన వారికి ఇచ్చినా ఇబ్బందులు వస్తాయని, గణపం కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తూ సరికొత్త వ్యూహానికి తెర తీశారు.
మేకపాటికి చెక్‌పెట్టే యోచనతో బీజేపీకి..
మేకపాటి చంద్రశేఖరరెడ్డికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నుంచి పార్టీ అధిష్టానం వరకు డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు మేరకు ఎమ్మెల్యే కాకర్ల ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవి బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి మండల పార్టీ అధ్యక్షురాలు పాలగుల్ల విజయలక్ష్మి పేరు సిఫార్సు చేశా రు. ఉదయగిరి బీజేపీ నేతలను సంప్రదించకుండా ఆమె పేరు సూచిండంపై కూడా ఆ పార్టీలో దుమా రం చెలరేగింది. పలువురు ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ, బీజేపీ మంత్రి సత్యకుమార్ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో రాష్ట్ర అధినాయకత్వం ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుంటామని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది.
రగిలిపోతున్న మేకపాటి
ఉదయగిరిలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరుసార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల అనంతరం ఆయన సతీమణి శాంతకుమారి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో మేకపాటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శాంతకుమారిని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ చేయాలని భావించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌సీపీని వదిలి బేషరతుగా టీడీపీ గూటికి చేరారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కాకర్ల సురేష్ విజయం కోసం కృషి చేశారు.
టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ బోర్డు మెంబరు లేదా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ అవకాశం తన సతీమణి శాంతమ్మకు కల్పించాలని చంద్రబాబును కోరారు. టీడీటీ బోర్డుకు అవకాశం ఇవ్వకపోవడంతో కనీసం ఏఎంసీ చైర్మన్ అయినా ఇస్తార ని భావించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ఆశలకు చెక్ పెడుతూ ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో మేకపాటి లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. చంద్రబాబు తనను మోసం చేశారని అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రశేఖరరెడ్డి రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.