ఏపీ చొరవతో దేశవ్యాప్తంగా పరిశ్రమలకు మేలు  | Sakshi
Sakshi News home page

ఏపీ చొరవతో దేశవ్యాప్తంగా పరిశ్రమలకు మేలు 

Published Sat, Sep 16 2023 4:58 AM

Interest Subsidy Scheme for Industries - Sakshi

సాక్షి, అమరావతి: పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మన రాష్ట్రం దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఎన్నో జాతీయస్థాయి అవార్డులను, గుర్తింపును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌.. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే తాజాగా కేంద్ర విద్యుత్‌శాఖ ప్రవేశపెడుతున్న పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకం. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా నూతన సాంకేతిక విధానాలను అవలంభించే పరిశ్రమలకు, అవి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో కొంత రాయితీగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ సహకారంతో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి కేంద్ర విద్యుత్‌శాఖ ఈ పథకాన్ని తీసుకొస్తోంది.

ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) అభయ్‌ భాక్రే చెప్పారు. ఇందులో రూ.6 వేల కోట్లను విద్యుత్‌ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జాతీయ ఎనర్జీ ఎఫిషియెంట్‌ సమ్మిట్‌–2023లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాధనల ఆధారంగానే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్యరంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.

దేశంలోనే తొలి ఇన్వెస్ట్‌మెంట్‌ బజార్‌ను విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో రూ.430 కోట్ల పెట్టుబడులను సాధించిందన్నారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోను అలాంటి సదస్సులు నిర్వహించగా మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పారిశ్రామిక రంగానికి ప్రత్యేక వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి బీజం వేసిందని, అలాగే ఏపీ ఇంధనశాఖ కూడా రెండేళ్ల కిందట వడ్డీ రాయితీ కోరుతూ ప్రతిపాదనల లేఖ రాసిందని తెలిపారు. 

ఇంధనం ఆదా, తగ్గుతున్న కాలుష్యం  
జి–20 సమ్మిట్‌లో ప్రపంచదేశాల నేతలు ఆశించినట్లు.. దేశంలో 2050 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలనే లక్ష్యానికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. 2021–22లో బీఈఈ చర్యలతో 27.75 ఎంటీవోఈ ఇంధనం ఆదా అయిందని, 130.21 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పొదుపు చేశామని తెలిపారు. 175.22 మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు.

పెర్ఫార్మ్, అచీవ్‌ అండ్‌ ట్రేడ్‌ (పాట్‌) పథకం ద్వారా ఈ ఏడాది మార్చి నాటికే 13 రంగాల్లో సుమారు 26 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయడమేగాక 70 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని ఆయన వివరించారు. ఈ సమ్మిట్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సీఈవో విశాల్‌కపూర్‌ తరఫున ఈఈఎస్‌ఎల్‌ సౌత్‌ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఏపీలో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య చర్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై నివేదిక సమర్పించారు.  

Advertisement
 
Advertisement