సర్కారు బడులపై కర్ర పెత్తనం! | Inspections with Revenue Department alleging errors in enrollment | Sakshi
Sakshi News home page

సర్కారు బడులపై కర్ర పెత్తనం!

Jan 28 2025 4:44 AM | Updated on Jan 28 2025 4:44 AM

Inspections with Revenue Department alleging errors in enrollment

ఎన్‌రోల్‌మెంట్‌లో తప్పులంటూ రెవెన్యూ శాఖతో తనిఖీలు

తనిఖీల్లో హాజరు, ఎన్‌రోల్‌మెంట్‌కు సరిపోకపోతే బోగస్‌గా గుర్తింపు

బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఉంటే టీచర్లు, హెచ్‌ఎంలపై కఠిన చర్యలంటూ హెచ్చరిక

అక్టోబర్‌ నాటికి డ్రాప్‌బాక్స్‌లో 2,02,791 మంది విద్యార్థులు

ఇంత మంది లేరంటున్న విద్యా శాఖ.. ఇదేమిటంటూ టీచర్ల ఆందోళన

సాక్షి, అమరావతి: విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెలకో కొత్త నాటకం ఆడుతోంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు సహా పలు హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు వెదుకుతోంది. తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవంకంటే అధికంగా ఉందని, తప్పుడు ఎన్‌రోల్‌మెంట్‌పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తోంది. అంతేగాక, విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తనం అప్పగించింది. 

విద్యార్థుల లెక్క తీసేందుకు ఎమ్మార్వో, ఎండీవో, ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది. వాస్తవానికి ఆధార్‌ నంబర్‌ ఆధారంగా విద్యార్థులను బడుల్లో చేర్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు యూడైస్‌తో సరిపోవడంలేదని, డ్రాప్‌ బాక్స్‌లో కనిపిస్తున్న 2,02,791 మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది. వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానికంగా గ్రామ/­వార్డు వలంటీర్లు, సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు. వారిని తిరిగి పాఠశాలల్లో చేరి్పంచే బాధ్యత తీసుకునేవారు. దీంతో డ్రాప్‌బాక్స్‌ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడిబయటి పిల్లలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.  

డ్రాప్‌ బాక్స్‌ లెక్కలు బోగస్‌ అంటూ.. 
పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 37 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల చేరికలు, వారి ఆధార్‌ వివరాలను యూడైస్‌తో అనుసంధానం చేశారు. దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఓ విద్యార్థి వరుసగా 30 రోజులు బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్య డేటా బేస్‌లోని ‘డ్రాప్‌బాక్స్‌’లోకి వెళ్లిపోతాయి. అంటే వారు డ్రాప్‌ అవుట్స్‌గా లెక్కించాలి. ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి హాజరు కాని వారు 10 నుంచి 50 మంది వరకు ఉంటారని అంచనా.

దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్‌ బాక్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య గతేడాది అక్టోబర్‌ నాటికి 2,02,791 మందికి చేరింది. ఇప్పుడు ఈ వివరాలను బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌గా గుర్తించనుంది. ఇలా బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు తీవ్రంగా హెచ్చరించారు. టీచర్‌ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్‌రోల్‌మెంట్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్‌ఎంలను హెచ్చరించారు. బోగన్‌ హాజరు వేసే హెచ్‌ఎంలపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బోగస్‌ హాజరును నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. 

ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర 
గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది. అలాగే, ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున నగదు తల్లుల ఖాతాల్లో జమయ్యేది. దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడులకు పంపేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ దాదాపు తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా డ్రాపవుట్స్‌ ఉంటే వలంటర్లు, సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడుల్లో చేర్చించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించింది. పైగా తల్లికి వందనం కింద ఇస్తా­మన్న రూ.15 వేలు ఇవ్వనేలేదు.

దీంతో చాలామంది నిరుపేదలు, కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు. పిల్లలు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో బడు­ల్లో చేరిన విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ పెరిగాయి. 2024 అక్టోబర్‌ నాటికి  2,02,791 మంది విద్యార్థులు డ్రాప్‌ బాక్స్‌లోకి చేరగా, ఈ మూడు నెలల్లో మరో 50 వేల మందికి పైగా పెరిగి ఉండవచ్చని అంచనా. కానీ, ఈ లెక్కలను బోగస్‌ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్క సరిపోవాలని, లేకుంటే కఠిచర్యలు తప్పవంటూ విద్యా శాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement