 
													పవన్ ఆకస్మిక పర్యటన.. అసంబద్ధ ఆరోపణలు.. మరోమారు విచారణకు కలెక్టర్‌కు ఆదేశం
పట్టా భూములు తప్ప కాలువలు, వాగులు, వంకలు లేవన్న మాచవరం ఎమ్మార్వో
ఫారెస్ట్ భూములు లేవని గతంలోనే తేల్చిన అటవీ అధికారులు
2014–19 మధ్య విషప్రచారం చేసి నిరూపించలేకపోయిన అప్పటి టీడీపీ ప్రభుత్వం
సాక్షి, నరసరావుపేట: సరస్వతి పవర్ భూముల సేకరణలో ఎటువంటి ఆక్రమణలు, అటవీ భూములు లేవని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెబుతున్నా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం ఏదో జరిగిపోయినట్లు ఊగిపోతున్నారు. దీనిపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి తన అక్కసును మరోమారు బైటపెట్టుకున్నారు. ఎలాంటి అక్రమాలూ జరగలేదని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెప్పినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అసత్య ప్రచారానికి దిగడంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. 
పవన్ ఆకస్మిక పర్యటన.. అసంబద్ధ ఆరోపణలు 
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరి«ధిలోని సరస్వతి పవర్స్ భూముల పరిశీలన కోసమని మంగళవారం ఆకస్మిక పర్యటన చేసిన పవన్‌కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం తనకు అలవాటైన అసంబద్ధ, పొంతనలేని మాటలతో సాగింది. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారన్నారని ఆరోపించారు. కానీ.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. స్థానిక రైతులంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 
ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరస్వతి పవర్స్ కంపెనీ తీసుకున్న భూముల్లో 24 ఎకరాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన అసై¯న్డ్ భూములు ఉన్నట్లు తేలిందని మరో వాదన వినిపించారు. దీనిపై మరోసారి సమగ్ర విచారణ చేసి నిగ్గు తేల్చాలని పల్నాడు కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని పవన్ తెలిపారు.
సరస్వతి పవర్స్ కంపెనీ కోసం భూములు తీసుకోవడం దగ్గర నుంచి నీటి కేటాయింపులు, లీజుల పునరుద్ధరణ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు ఎందుకో మెత్తబడిపోయారు, భయపడుతున్నారని పవన్‌కళ్యాణ్ అన్నారు. 
2014–19 మధ్య ఏం తేల్చారు? 
సరస్వతి భూముల సేకరణలో అక్రమాలు ఉన్నాయంటూ 2014–19 మధ్య టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విషప్రచారం చేశారు. అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ భూములపై పదేపదే ఆరోపణలు చేస్తూ అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రగల్బాలు పలికారు. ఐదేళ్ల కాలం ముగిసినా ఒక చిన్న తప్పును సైతం గుర్తించలేకపోయారు. ఈసారి కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి అసత్య ప్రచారాలకు తెరలేపారు. 
కూటమి నేతల కుట్రల వల్ల పల్నాడు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు అగిపోయి ఇక్కడి ప్రజలు ఆర్థి కంగా బలపడతారు. కానీ.. కూటమి నేతల విషప్రచారాలు, కుట్రలతో పారిశ్రామిక వేత్తలు భయపడి వెనుకడుగు వేస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ ఈప్రాంత అభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా కేవలం విద్వేష ప్రసంగాలు చేయడాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు కీలకమైన వరికపూడిసెల, పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది, వాటిని పూర్తి చేస్తామని ఒక్క మాట కూడా అనకపోవడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.  
అవన్నీ పట్టా భూములే: తహశీల్దార్ 
సరస్వతి పవర్స్ సంస్థ భూములన్నీ పట్టా భూములేనని  మాచవరం తహశీల్దార్ క్షమారాణి గతనెల 26న మీడియాకు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సరస్వతి భూముల్లో తనిఖీ చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ భూముల్లో చెరువులు, కుంటలు, వాగులు, నీటి వసతులేవీ లేవని చెప్పారు. 
అటవీ భూములేవీ ఆక్రమణకు గురికాలేదు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 
డిప్యూటీ సీఎం ఆదేశాలతో అక్టోబర్ 26న మాచవరం మండలంలోని చెన్నాయపాలెం, దాచేపల్లి మండలంలోని తంగెడ అటవీ భూములను సిబ్బందితో కలిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. అటవీ భూములేవి అక్రమణకు గురి కాలేదన్నారు. అటవీ భూములకు సుమారు 8 మీటర్ల దూరంలో సరస్వతి భూములున్నట్టు గుర్తించామన్నారు.   

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
