
∙స్టోన్ డస్ట్ ముసుగులో తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలింపు
ఏడు టిప్పర్లను పట్టుకున్న నగరి పోలీసులు
ఏడుగురు డ్రైవర్ల అరెస్ట్
నగరి: సినీఫక్కీలో స్టోన్ డస్ట్ ముసుగులో ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఆదివారం వేకువజామున నగరి పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. నగరి సీఐ విక్రమ్, తహశీల్దార్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కొంతకాలంగా స్టోన్ డస్ట్ ముసుగులో రాజంపేట నుంచి నగరి మీదుగా అక్రమంగా ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది.
ఆదివారం వేకువజామున నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డులో తమిళనాడు సరిహద్దు వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. డస్ట్ స్టోన్ పేరుతో వెళుతున్న ఏడు టిప్పర్లను ఆపి తనిఖీలు చేశారు. టిప్పర్లలో 90 శాతం ఇసుక నింపి, దానిపై పది శాతం స్టోన్ డస్ట్ వేసి పట్టాలు కప్పినట్లు గుర్తించారు.
ఏడు టిప్పర్లను సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన డ్రైవర్లు వి.జయకృష్ణ(38), ఎస్.పాండియన్(42), ఎ.అజిత్‌కుమార్(29), ఎం.ప్రవీణ్‌కుమార్(28), ఏఎస్ శ్రీజిత్(26), ఎన్.అశోక్(31), నగరి మండలం గుండ్రాజుకుప్పం గ్రామానికి చెందిన వి.దేవరాజులు(62)ను అరెస్టు చేశారు.
చెన్నై నుంచి వచ్చి స్టోన్ క్వారీ లీజుకు తీసుకుని
అరెస్ట్ చేసిన డ్రైవర్లను పోలీసులు విచారించగా, చెన్నై నుంచి భరత్ అనే వ్యక్తి నగరికి వచ్చి గుండ్రాజుకుప్పం వద్ద వేల్ అండ్ కో స్టోన్ క్వారీని లీజుకు తీసుకున్నాడని తెలిపారు. అతను తమిళనాడులోని కొంతమంది లారీ యజమానులను సిండికేట్ చేసి ఈ అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నాడని వివరించారు. తమిళనాడు నుంచి వచి్చన లారీలు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రీచ్ నుంచి ఇసుక లోడ్ చేసుకుని నగరిలోని వేల్ అండ్ కో క్రషర్ వద్దకు వస్తాయని చెప్పారు.
అక్కడ ఇసుకపై కొద్దిగా స్టోన్ డస్ట్ నింపి పరదాలు కట్టి తమిళనాడుకు పంపిస్తున్నారని తెలిపారు. స్టోన్ డస్ట్ తరలింపునకు ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ చేసిన ఏడుగురు డ్రైవర్లను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. క్రషర్ నిర్వాహకుడు భరత్‌ను, తెరవెనుక సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
అధికార పార్టీ నేతల అండతోనే?
స్థానిక అధికార పార్టీ నేతల అండతోనే ఈ ఇసుక దందా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండ లేకుండా రాజంపేట నుంచి నగరికి, అక్కడి నుంచి తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలించడం, భరత్ అనే వ్యక్తి చెన్నై నుంచి నగరి వచ్చి క్రషర్ లీజుకు తీసుకుని దర్జాగా ఈ దందా సాగించడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.