కొవ్వూరు, తాళ్లపూడి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా
నిత్యం వందల లారీల్లో సరిహద్దులు దాటించి మరీ తరలింపు
రోజుకు కోటిన్నర... నెలకు రూ.45 కోట్ల అక్రమ సంపాదన
కూటమి నేతల నేతృత్వంలో బరితెగించిన ఇసుక మాఫియా
నియోజకవర్గ ప్రజాప్రతినిధి పూర్తి స్థాయి అండదండలు
టీడీపీ కీలక నేత కనుసన్నల్లో భారీ దందా
కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు
గోదావరి ఇసుకను అక్రమార్కులు సరిహద్దులు దాటించేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రకృతి వనరును స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిత్యం వందల లారీల ఇసుక హైదరాబాద్ తరలిపోతోంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ కీలక నేత కనుసన్నల్లో రూ.కోట్లలో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తెలిసినా అధికారులు మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. -సాక్షి, రాజమహేంద్రవరం
ఒకే బిల్లుపై అనేకసార్లు
కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో 15 స్టాక్ పాయింట్లున్నాయి. వీటి వద్ద కనీస పర్యవేక్షణ లేదు. సీసీ కెమెరాలు, వేబ్రిడ్జి లేవు. నిత్యం ఒక అధికారి ఉండాలి. మామూళ్లు తీసుకుని వారు కనపడకుండా పోతున్నారు. ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. పై అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడే కనిపిస్తున్నారు. దీనికితోడు సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది.
» స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక టన్ను రూ.160కు విక్రయించాల్సి ఉండగా కూటమి నేతల కనుసన్నల్లో రూ.300–రూ.350 వసూలు చేస్తున్నారు.
» కొవ్వూరు, చిడిపి, తాళ్లపూడి, కుమారదేవం, అరికిరేవుల తదితర స్టాక్ పాయింట్లలో ఇసుకను లారీల్లో నింపి రాష్ట్రం దాటిస్తున్నారు. గోపాలపురం, ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల మీదుగా పరిమితికి మించి రవాణా చేస్తుండడంతో ఇసుక రోడ్డుపైకి జారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొంగ వే బిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక లారీకి బిల్లు తీసుకుని అనేక ట్రిప్పులు వేస్తున్నారు. ఒకవేళ పట్టుకుంటే లారీ మరమ్మతుకు వెళ్లింది, రెండ్రోజులు ఆగిందని బుకాయిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా బరితెగించింది. గామన్ బ్రిడ్జి సమీపంలో కుమారదేవం, ఆరికిరేవుల, పంగిడి, తాళ్లపూడి, చిడిపి, కొవ్వూరు తదితర చోట్ల నుంచి రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తోంది. లారీకి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.కోటిన్నర నెలకు రూ.45 కోట్లు కూటమి నేతలు దండుకుంటున్నారు.
నియోజకవర్గంలోని ద్విసభ్య కమిటీ సభ్యులు, ఓ కీలక నేతకు చెందిన ఉద్యోగులు, ఓ ప్రజాప్రతినిధి అనుచరులు వ్యవహారమంతా దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల మామూళ్లు దండుకుంటున్న మైనింగ్ అధికారులు కళ్లెదుటే లారీలు తరలుతున్నా కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల హైదరాబాద్ వెళ్తున్న లారీలను పట్టుకున్నట్లు హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు రెండ్రోజుల తర్వాత మిన్నకున్నారు.
కలెక్టర్ దృష్టిసారిస్తేనే...
స్టాక్ పాయింట్ల నుంచి నిత్యం వందల లారీల ఇసుక తెలంగాణకు తరలుతోంది. మైనింగ్, రెవెన్యూ, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. నామమాత్రంగా జరిమానాలు, కేసులు పెట్టి వదిలేస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పి మరుసటి రోజే ఇసుక మాఫియా రంగంలోకి దిగుతోంది. తిరిగి అవే లారీలతో అక్రమ రవాణా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లా కలెక్టరైనా దృష్టిసారిస్తేనే దీనికి అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.


