మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో టీడీపీ పెద్దల ప్రోద్బలంతో చేసిన పోస్టులు
అసభ్యకర పోస్టులు.. చోద్యం చూస్తున్న పోలీసు శాఖ
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్‌బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు ... టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దు్రష్పచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది.
ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశ్వంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తుండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో పుంఖానుపుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు.
మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతుండటం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్డడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించవన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించడమే లేదు.
టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ...నిలదీస్తూ వైఎస్సార్‌సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తుండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది.


