ఐఐఎస్‌ఈఆర్‌ రెండో స్నాతకోత్సవం

IISER Second Convocation Andhra Pradesh - Sakshi

65 మందికి డిగ్రీలు ప్రదానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) రెండో స్నాతకోత్సవం (కాన్వొకేషన్‌) బుధవారం హైబ్రిడ్‌ మోడ్‌ (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌)లో నిర్వహించారు. ఐఐఎస్‌ఈఆర్‌ నెలకొల్పి ఈ ఏడాదికి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. సంస్థలోని రెండో బ్యాచ్‌ (2016 బ్యాచ్‌) విద్యార్థులు ఐదేళ్ల బీఎస్‌–ఎంఎస్‌ డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాన్వొకేషన్లో వారికి డిగ్రీలను ప్రదానం చేశారు. కోవిడ్‌ కారణంగా హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెనేట్‌ సభ్యులు, ఇతరులు పరిమిత సంఖ్యలో ప్రత్యక్షంగా హాజరవ్వగా, మిగతావారు ఆన్‌లైన్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ ప్రొఫెసర్‌ కె.విజయ్‌రాఘవన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులనుద్దేశించి ప్రసంగిస్తూ.. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, అప్పుడే మానవజాతి భవిష్యత్‌లోనూ సజావుగా మనుగడ సాగించగలుగుతుందని చెప్పారు. మానవజాతి పరిణామం, భూగోళంపై మనుగడకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముంబై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సైంటిస్టు, ఐఐఎస్‌ఈఆర్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జేబీ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులు సానుకూల దృక్పథం, నైపుణ్యాలు అలవరచుకుని బాధ్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు.

విద్యార్థులు ఇక్కడ సముపార్జించిన జ్ఞానంతో సమాజానికి, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు సాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఐఐఎస్‌ఈఆర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎన్‌.గణేశ్‌ సంస్థ సాధించిన అకడమిక్, రీసెర్చ్‌ ప్రగతిని నివేదించారు. కాన్వొకేషన్లో 64 మంది విద్యార్థులు బీఎస్‌–ఎంఎస్‌ డిగ్రీలు పొందగా, ఒకరు బీఎస్‌ డిగ్రీని అందుకున్నారు. అత్యధిక సీజీపీఏ సాధించిన వీసీ తమరాయి వల్లీకి గోల్డ్‌మెడల్, ఓంకార్‌ వినాయక్‌ నిప్పణికర్, వీణా శంకర్‌ అద్వానీలకు సిల్వర్‌ మెడల్‌లను ప్రకటించారు. భాబేష్‌కుమార్‌ త్రిపాఠికి 2021 బెస్ట్‌ గ్రాడ్యుయేట్‌ బహుమతిని అందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top