
జమ్మలమడుగు: ‘నా భర్త జైపాల్ రెడ్డి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నా బంగారు నగల్ని, ఆస్తులన్నింటినీ ఆమెకు ఇచ్చాడని.. నన్ను, నా ముగ్గురు ఆడపిల్లల్ని రోడ్డున పడేశాడు. మాకు న్యాయం చేయండి’ అంటూ బాధితురాలు స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేసింది.
శుక్రవారం ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో తన కుమార్తెలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘16 సంవత్సరాల క్రితం జైపాల్‌రెడ్డితో నాకు వివాహం జరిగింది. మాకు ముగ్గురు కుమార్తెలు. గీత, పావని, ప్రసన్న. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో జీవనం ప్రశాంతంగా సాగింది. అయితే ఇటీవల కొంత కాలం నుంచి మరో మహిళతో నా భర్త అక్రమ సంబంధం పెట్టుకని తమని పట్టించుకోవడం మానేశాడు. ఇంటికి కూడా రావడంలేదు.
విషయం తెలియడంతో నా భర్తను నిలదీశానని.. ఇలా పిల్లల్నివదిలిపోతే ఎలా అంటూ ప్రశ్నించాను. అయితే మీరు నాకు అవసరం లేదని.. నేను ఉంచుకున్న దాంతోనే ఉంటానని చెప్పి వెళ్లిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలతో ఏం చేయాలో నాకు దిక్కుతోచడం లేదు. పిల్లల పోషణ భారం అవుతోంది. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఉంది. నా భర్త తమ కుటుంబాన్ని పోషించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.. న్యాయం చేయండి.. లేకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య ఒక్కటే శరణ్యం’ అంటూ స్వర్ణలత కన్నీటి పర్యంతైమంది. ఈ మేరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.