తీరం.. నిర్మానుష్యం

Hunting ban for fishermen in AP - Sakshi

మత్స్యకారులకు వేట నిషేధం పర్యాటకులకు కరోనా ఎఫెక్ట్‌  పడవల మరమ్మతులకు కర్ఫ్యూ అడ్డుగోడ

బాపట్ల: నిత్యం పర్యాటకులు, మత్స్యకారుల వేటలతో కళకళలాడే తీరం నిర్మానుష్యంగా మారింది. ఏడాదిలో వేసవి కాలంలోనే అత్యధిక పర్యాటకులతో కిటకిటలాడుతూ సూర్యలంక తీరం కనిపిస్తుంది. తాజాగా కరోనాతో పర్యాటకులకు బ్రేక్‌లు పడగా వేట నిషేధం మత్స్యకారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం మత్స్యకారులు తమ పడవలకు మరమ్మతులు చేసుకునేందుకు కర్ఫ్యూ అడ్డుగోడగా ఎదురైంది. సూర్యలంకతోపాటు, దాన్వాయ్‌పేట, కృపానగర్, పాండురంగాపురం, రామ్‌నగర్, ఆదర్శనగర్‌లో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. నియోజకవర్గంలోని 10 వేల మందికిపైగా ఉన్న మత్స్యకారులు వేట నిషేధం, లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

చిరు వ్యాపారుల్లో అలజడి..
కరోనా కారణంగా పర్యాటకులు తీరానికి రాకపోవటంతో తీరం వద్ద ఉండే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బోణీలు కూడా కాకపోవటంతో రెండునెలలుగా చిరువ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. తీరాన్ని నమ్ముకుని కనీసం 50 మందికి పైగా చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటారు. అయితే కరోనా కారణంగా పర్యాటకులు రాకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

మరమ్మతులకు ఇబ్బందులు..
సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే దశ కావటంతో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి మే 31 వరకు సముద్రంలో వేట నిషేధం విధిస్తారు. అయితే గతేడాది కరోనా కారణంగా లాక్‌డౌన్లతో వేట నిలిచిపోగా ఈ ఏడాది కూడా అదేవిధంగా మారింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తుండగా వేట నిషేధం సమయం పూర్తయ్యేందుకు మరో 20 రోజులు గడువు ఉంది. వేట నిషేధానికి ముందే పడవలు, వలలను సిద్ధం చేసుకునేందుకు ప్రస్తుత కర్ఫ్యూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బాపట్ల ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పడవలు, వలల మరమ్మతులకు నిజాంపట్నం ఓడరేవుకు వెళ్లటం పరిపాటిగా మారింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వేట నిషేధం సమయంలో కూడా మరో పనులకు వెళ్లేందుకు వీలులేకపోవటంతో పడవలు, వలలు సిద్ధం చేసుకోవటానికి కూడా అవకాశం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ మత్స్యకారుల జీవితాల్లో తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టినట్లయింది.

రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఊరట..
మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏటా వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల ఇబ్బందులను గుర్తెరిగి వారికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా నిర్ణయించారు. ఈ ఆర్థిక సాయం వచ్చే నెలలో అందించనున్నారు. దీంతో మత్స్యకారులకు కొంత ఊరట లభించనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top